సీఎం జగన్ తిరుపతి పర్యటన దృష్ట్యా.. పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలను గృహనిర్బంధం చేశారు. చంద్రగిరిలో తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తిరుపతిలో సీఐటీయూ నేతలను, శ్రీకాళహస్తిలో జనసేన నేతలను గృహ నిర్బంధించారు.
శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులోని హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్, అపాచీ పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్ద చేరుకొని అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మూడు ప్రాంతాల్లో సాగనున్న సీఎం పర్యటన నేపథ్యంలో.. నిరసన కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు విపక్ష నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు.
ఇవీ చూడండి: