Kalangi Reservoir: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కాళంగి జలాశయం. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ప్రాజెక్టు నిర్వహణాలోపాలు ఇలా లీజేజీల రూపంలో బయటకు వెళ్తున్నాయి.
కాళంగి జలాశయం నీటి నిల్వ సామర్థ్యం దాదాపు ఒక టీఎంసీ. కేవీబీపురం, తొట్టంబేడు,.. బీఎన్ కండ్రిగ మండలాల్లోని పదివేల ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటికీ ఇదే ఆధారం. అలాంటి ఆనకట్ట బలహీనమై అనేకచోట్ల గండ్లు పడ్డాయి. నీరు లీకైపోతున్నా నివారించే ప్రయత్నాలు చేయడంలేదు. లోతట్టు గ్రామాలు ఎప్పుడేం ఉపద్రవం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నాయి. నీరు వదిలేటప్పుడు జలహారతులంటూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఎమ్మెల్యేలకు నిర్వహణ పట్టడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇక ప్రాజెక్టు నిర్వహణలో కీలకం గేట్లు. జలాశయానికి పేరుకు 18 గేట్లున్నాయి. అందులో అత్యధికం అలంకారప్రాయమే. 2015 వరదల సమయంలో కొన్నిగేట్లు కొట్టుకుపోగా వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి మాత్రమే పనిచేస్తున్నాయి. కనీసం వాటికి గ్రీజ్ పెట్టే దిక్కులేదు. అత్యవసర సమయాల్లో రైతులు తలో చేయి వేయకపోతే గేట్లు ఎత్తలేని పరిస్థితి.
నీటి నిల్వ సామర్థ్యం తక్కువ కావడం వల్ల చిన్న వర్షాలకే కాళంగి ప్రాజెక్ట్ నిండిపోతుంది. ఇక భారీ వర్షాలు వస్తే ఆనకట్ట ఉంటుందో లేదో అనే భయాందోళన ఆయకట్టు రైతుల్లో ఉంది. అన్నమయ్య, గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదాల తరహాలో ప్రమాదం జరిగాక విచారం వ్యక్తంచేసే కన్నా.. తక్షణమే మరమ్మతులు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: