Nara Lokesh Yuvagalam Padayatra: వైఎస్ జగన్‌పై నారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తల్లి, చెల్లి మాకు నమ్మకం లేదు అని వెళ్లిపోయారని.. ఇక మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలను ఎలా నమ్మమని చెబుతారని ప్రశ్నించారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి జగన్.. ప్రజలందరికీ అరగుండు కొట్టాడని.. మరో అవకాశం ఇస్తే పూర్తిగా గుండు కొడతాడని ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డికి అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ పేదల గూడుపై లేదని నారా లోకేశ్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మేనకూరు శివారు బస కేంద్రం నుంచి 137వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. మేనకూరు నుంచి ప్రారంభించిన పాదయాత్ర వడ్డికుంట కండ్రిగ, గ్రద్దకుంట క్రాస్, తిమ్మాజీ కండ్రిగ మీదుగా సాగింది.
వడ్డికుంట కండ్రిగ గ్రామస్థులు లోకేశ్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. టీడీపీ పాలనలో కట్టుకున్న ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపేసిందని లోకేశ్‌కు వివరించారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇల్లు మంజూరు చేయడం లేదన్నారు. అత్తివరం - నాయుడుపేట మెయిన్ రోడ్డు ఏపీఐఐసీ జోన్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీఐఐసీ జోన్లో 4 లైన్ల రోడ్డు నిర్మించాలని కోరారు.
అనంతరం లోకేశ్ మాట్లాడుతూ సెంటు పట్టా పేరుతో ఆవాసానికి పనికిరాని ఇంటి స్థలాలను అంటగట్టి 7వేల కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలచిపోయిన 2 లక్షల ఇళ్లకు.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అదనపు ఆర్థిక సాయం అందించి పూర్తి చేశామని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇస్తామని.. ఏపీఐఐసీ జోన్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
"ఈ యువగళం ప్రారంభమై.. 137 రోజులు అయింది. గత 135 రోజులలో జగన్ అరడజను స్కీమ్‌లు ప్రవేశపెట్టాడు. మొదటిది మా నమ్మకం నువ్వే అంట.. తల్లీ, చెల్లీ మేము నమ్మము ఛీఅని పొమన్నారు. తరువాత మా భవిష్యత్తు నువ్వే అని మరొకటి తీసుకొని వచ్చాడు. గత నాలుగు సంవత్సరాలుగా మీరు చేసింది ఏమిటి అని.. మీరు అంటించిన స్టిక్కర్లు తీసేసి డ్రైనేజీలో పడేశారు. దాని తర్వాత మరో కార్యక్రమం.. జగన్‌కు చెబుదాం అంట.. నాలుగు సంవత్సరాలుగా చెప్పి ప్రజలు అలసిపోయారు. చివరికి వైసీపీ నాయకులు వస్తే.. చెప్పులు చూపించే పరిస్థితికి ప్రజలు వచ్చారు.
ఇంకొకటి.. గడప గడపకు అంట.. ప్రజలంతా తిట్టిన తిట్టులకు వైసీపీ సభ్యులంతా పారిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా.. సురక్ష కార్యక్రమం తీసుకొచ్చారు. నాలుగు సంవత్సరాల తరువాత ఇప్పుడు లబ్ధిదారులను నమోదు చేస్తామంటూ ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది. ఒక్క అవకాశం ఇస్తే సగం గుండు కొట్టాడు. మరో అవకాశం ఇస్తే పూర్తిగా గుండు కొడతాడు అని ప్రజలంతా అనుకుంటున్నారు. అందుకే సైకో పోవాలని ప్రజలు అంటున్నారు". - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి