Lokesh 36th Day Padayatra: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 36వ రోజు కలికిరి మండలంలో 14.2 కిలోమీటర్లు సాగింది. పీలేరు శివారు వేపులబయలు నుంచి ప్రారంభించిన పాదయాత్ర అంకాళమ్మతల్లి దేవాలయం, శివపురం, తిమ్మిరెడ్డిగారిపల్లి, కొర్లకుంట, పట్టికాడ, సత్యపురం, కలికిరి, నగిరిపల్లి కూడలి మీదుగా ఇందిరమ్మ కాలనీ సమీపంలోని విడిది కేంద్రం వరకు సాగింది. వేపులబయలులో బీసీల సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. శివపురం అంకాళమ్మ గుడివద్ద సగర సామాజికవర్గీయులు యువనేతను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. వైసీపీ నాయకుడు, కలికిరి సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, మహల్ మాజీ సర్పంచ్ సతీష్ రెడ్డి, ఎనుగొండపాలెం మాజీ ఎంపిటిసి శ్రీనివాసుల నాయుడులతో సహా వైసీపీకు చెందిన 1500 కుటుంబాలు యువనేత లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. లోకేశ్ వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు వేపులబయలులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. బీసీలకు రక్షణ కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చట్టం తెస్తామని లోకేశ్ హమీ ఇచ్చారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం లేదని.. సామాజిక అన్యాయం మాత్రమే ఉందని దుయ్యబట్టారు. నిధులు, అధికారం లేని పదవులు బీసీలకు ఇచ్చి ముఖ్యమైన పదవులు అన్ని జగన్ సొంత సామాజిక వర్గానికి ఇచ్చారని ఆరోపించారు. టీడీపీ హయాంలో బీసీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన నిధులు... వైసీపీ హయాంలో వెచ్చించిన నిధులపై చర్చకు సిద్దమని ప్రకటించినా మంత్రులు పారిపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికుల పెట్టుబడి తగ్గిస్తామని.. రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని.. లోకల్ ఫేక్ సమ్మిట్ అని మీడియా సమావేశంలో లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రచార ఆర్భాటం, ఇగోను సంతృప్తి పరుచుకునేందుకు సీఎం నిర్వహించిన సమావేశమని విమర్శించారు. ఇప్పటికైనా సీఎంగా తాను తెచ్చిన ఓ కంపెనీ ముందు సెల్ఫీ దిగి జగన్ పంపగలరా అని.. లోకేశ్ సవాల్ విసిరారు. ఎప్పటినుంచో వారసత్వంగా కంచుకోటగా ఉన్న పులివెందులలో కాకుండా ఎప్పుడూ గెలవని సీట్లో పోటీ చేయడానికి జగన్ సిద్ధమా అని లోకేశ్ ప్రశ్నించారు.
పాదయాత్రలో భాగంగా కలికిరి ఇందిరమ్మనగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ పాల్గొన్నారు. సభలో వైసీపీకి చెందిన 1500 మంది టీడీపీలో చేరారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం దృష్ట్యా టీడీపీలో చేరామని.. జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలోనే తమతో పాటు తమ గ్రామాల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లాయని అర్థమైందని పేర్కొన్నారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి మాత్రమేనని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక వైసీపీలో పనిచేసిన వారికి ఏమైనా న్యాయం జరిగిందా అని, కనీస గౌరవం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చేతిలో రెడ్డి సామాజికవర్గం కూడా బాధితులేనని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీని గాలికొదిలేశారని ఆరోపించారు. సొంత బాబాయ్ ని చంపినవాడు రాష్ట్ర ప్రజలను గౌరవిస్తారా అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు.
లోకేశ్ 36వ రోజు పాదయాత్ర కలికిరి ఇందిరా కాలనీ సమీపంలోని విడిది కేంద్రం వరకు సాగింది. రాత్రికి అక్కడే లోకేశ్ బస చేశారు. మంగళవారం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రంలో మైనారిటీలతో ముఖాముఖి అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారు.
ఇవీ చదవండి :