GSLV MARK 3 SUCCESS : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో అతి భారీ రాకెట్ LVM3ని.. విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న.. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాలకు భారీ రాకెట్.. LVM3 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి దూసుకెళ్లింది. బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్ సంస్థ 36 ఉపగ్రాహలను.. ఒకేసారి మోసుకెళ్లిన LVM3.. వాటిని దిగ్విజయంగా నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
LVM 3 నింగిలోకి వెళ్లిన తర్వాత 36 ఉపగ్రహాలు రాకెట్ నుంచి వేరుపడి..నిర్దేశిత కక్ష్యల్లోకి ఒకదాని తర్వాత ఒకటి చేరాయి. దీంతో శాస్త్రవేత్తల్లో.. ఆనందాతిరేకలు వ్యక్తమయ్యాయి. LVM3 ప్రయోగం విజయవంతం కావడంతో.. తమ శాస్త్రవేత్తలకు దీపావళి ముందుగానే మొదలైందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ అన్నారు. రాకెట్ లాంచ్ లో.. ముందుగా 16 ఉపగ్రహాలు తొలుత నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్నాయని.. మిగతా ఉపగ్రహాలు కూడా వాటి లక్ష్యాలను చేరుకుంటాయని తెలిపారు. LVM3 ప్రయోగంలో.. భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్ విజయవంతం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఉందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
వన్‌వెబ్ ఇండియా-వన్ మిషన్ పేరుతో.. ఇస్రో, లండన్‌కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్ సంయుక్తంగా.. 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చాయి. 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను.. జియోసింక్రనస్ కక్ష్యలోకి ప్రవేశ పెట్టే సామర్ధ్యం LVM3కి ఉందని.. ఇస్రో అధికారులు తెలిపారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్-NISL, ఇస్రో, వన్‌వెబ్ మధ్య ఒప్పందం మేరకు.. ప్రయోగించే ఈ ఉపగ్రహాలతో.. ఇస్రో తొలిసారి ప్రపంచ వాణిజ్య విపణిలోకి అడుగు పెట్టింది. మరో 36 ఉపగ్రహాలను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రయోగించనున్నట్లు.. NISL అధికారి వెల్లడించారు.
అభినందించిన గవర్నర్ : 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి నూతన రికార్డును నమోదు చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. 5796 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భారత్ రాకెట్లు కక్ష్యలోకి తీసుకెళ్లటం ఇదే మొదటిసారని తెలిపారు. 1999 నుంచి ఇస్రో 381 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. అనితర సాధ్యమైన పురోగతిని నమోదు చేసిందని కొనియాడారు. ఇస్రో శాస్త్రవేత్తలకు దేశం రుణపడి ఉంటుందని గవర్నర్ తెలిపారు.
ఇవీ చదవండి: