Three Killed In Lightning Strikes in AP: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో ప్రమాదం జరిగింది. ఈదురుగాలకు రావి చెట్టు విరిగి పడటంతో కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘనటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఆలయంలో ప్రమాదం చాలా బాధాకరమైన ఘటన అని వెల్లడించారు. మృతుని కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో ఒకరికి కాలు, మరొకరికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Rains: రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు.. ఎండ నుంచి ఊరట పొందిన ప్రజలు
పిడుగుపాటుకు ఇద్దరు మృతి: ఓ వివాహ వేడుకకు వచ్చినవారు పిడుగు పడి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. హాలహర్వి మండలం బొలగోటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బంధువుల వివాహనికి శేఖర్ గౌడ్ (31), బసవరాజు గౌడ్ (30) వచ్చారు. వీరు కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఉత్తనూరుకు చెందిన వారిగా మృతుల బందువులు వెల్లడించారు. ఎండ, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో శేఖర్ గౌడ్, బసవరాజు గౌడ్ ఆలయం సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. కొద్ది సేపటికే ఉరుములు, మెరుపులు ఆరంభమయ్యాయి. చెట్టుపై పిడుగు పడడంతో శేఖర్ గౌడ్, బసవరాజు గౌడ్ ఘటనా స్థలంలో మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. శుభ కార్యానికి వచ్చినవారు కళ్ల ముందే మరణించటంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది.
Rains in AP: రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. కనిగిరిలో విద్యుత్ లేక నిలిచిన డయాలసిస్ సేవలు
భీభత్సాన్ని సృష్టించిన వర్షాలు: బాపట్ల జిల్లా చీరాలలో ఈదురుగాలులు భీభత్సాన్ని సృష్టించాయి. ఉదయం నుండి ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. అనంతరం తీవ్ర ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చీరాల పట్టణంలోని పలుప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. బాలాజీ ధియేటర్ ఎదుట భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టుకొమ్మలు, విద్యుత్ తీగలు మీద పడటంతో విద్యుత్ తీగలు తెగి.. రెండు విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయినర్ను తెప్పించి సహాయచర్యలు చేపట్టారు. ఈదురుగాలులు భీభత్సానికి చీరాల,పేరాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొత్తపేట వీచిన పెనుగాలులకు ఓంకార క్షేత్రంలో శివాలయంలో ధ్వజస్తంభం కూలిపోయింది.