CM Jagan released YSR Nethanna Nestham funds: పేదలకు మంచి చేస్తున్న వాలంటీర్లపై మంచి చరిత్ర లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ఘాటుగా విమర్శించారు. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందిస్తూ సేవ చేస్తున్న వాలంటీర్లపై సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పర్యటించిన సీఎం జగన్.. నేతన్న నేస్తం నిధులు విడుదల చేశారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కక.. తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేతన్నలను ఆదుకునేందుకు నేతన్న నేస్తం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ.. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. మొత్తం 80 వేల 686 మంది లబ్ధిదారులకు ఈ పథకంతో ప్రయోజనం కలుగుతుందని సీఎం చెప్పారు. ఐదేళ్లలో ఈ పథకానికి 970 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు జగన్ పేర్కొన్నారు. ఎండ, వాన లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్ల గురించి ఇటీవల కొందరు మాట్లాడుతున్నారని సీఎం జగన్ ఘాటుగా విమర్శించారు. మంచిచేస్తున్న వాలంటీర్లపై ఆరోపణలు చేయడం తగదన్నారు. మంచి చేసిన చరిత్ర లేనివారే వాలంటీర్లను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.
- ALSO READ: అధ్వానంగా రహదారులు.. బటన్ నొక్కు జగనన్నా..!
వాలంటీర్లపై సంస్కారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుకు శ్రీకారం చుట్టామన్న జగన్.. చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే తన మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేశాడని విమర్శించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేస్తున్న వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ప్రజలకు మంచి చేస్తున్న వ్యవస్థలపై విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. వాలంటీర్లలో 60 శాతం మహిళలు ఉంటే.. మహిళలను రవాణా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లు ఎలాంటి వారో రాష్ట్ర ప్రజలకు తెలుసని.. చంద్రబాబు, అతని దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది ఎలాంటి వారో కూడా ప్రజలకు బాగా తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఎం రాకతో ప్రజలకు ఇక్కట్లు.. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పట్టణంలో పలు రహదారులపై బారికేడ్లు అడ్డం పెట్టారు. విశ్వోదయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుంచి.. కైవల్యా నది వంతెనలు, క్రాస్ రోడ్డు కూడలి మీదుగా ముఖ్యమంత్రి సభాస్టలికి దగ్గర్లోని వల్లివెడు వరకు రోడ్లన్నీ బారికేడ్లతో నిండిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన ఏరియాలో అంగళ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టడంతో దుకాణాలు తెరుచుకునే వీలు లేకపోయింది. పట్టణంలో విద్యాసంస్థలు మూత పడ్డాయి.