Union EX Minister Chinta Mohan on Margadarsi: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే మార్గదర్శి సంస్థపై ఏపీ సీఐడీ దాడులు చేస్తోందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందన్నారు. అటువంటి వాటిపై సీఐడీతో దర్యాప్తు చేయించకుండా మీడియాను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇలాంటి పద్ధతిని వైసీపీ మార్చుకోవాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా సంస్థలపై దౌర్జన్యాలు ఆపాలని చింతా మోహన్ సూచించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. మార్గదర్శి విషయంలో సీఐడీ దుందుడుకు చర్యలను తాను తప్పుపడుతున్నట్లు స్పష్టం చేశారు.
జగన్ మోహన్ సర్కార్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన కొన్ని ప్రాజెక్టులను బీజేపీ, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కలిపి ఆపేశాయని మండిపడ్డారు. ఇన్నిసార్లు దిల్లీకి వెళ్లిన జగన్.. ఈ ప్రాజెక్టుల గురించి కేంద్ర పెద్దలతో మాట్లాడారా అని నిలదీశారు. జగన్ దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియదన్నారు.
CID on Margadarshi: మార్గదర్శి వ్యవహారంపై మాటమార్చిన సీఐడీ.. సమధానాలు చెప్పలేక తడబాటు
మాడు పార్టీలు కలిసి త్రీ ఇన్ వన్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ, టీడీపీలు కలిసి త్రీ ఇన్ వన్‌గా మారాయని ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటు వేసిన, టీడీపీకి వేసిన బీజేపీకి వేసినట్లే అని విమర్శించారు. మూడు పార్టీలు మిలాఖత్ అయ్యి భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు.
కర్ణాటకలో జరిగిన విధంగా దేశం మొత్తం కాంగ్రెస్ హవా: అలాగే ఒడిశాలోని ఘోర రోడ్డు ప్రమాదానికి భారతీయ జనతా పార్టీనే కారణమని విమర్శించారు. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినప్పటికీ నామమాత్రంగా లెక్కలు చూపుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తిలో నిర్వహించే బహిరంగ సమావేశానికి ప్రచారం కోసం పెద్ద ఎత్తున అవినీతి డబ్బును ఖర్చు పెడుతున్నారనని దుయ్యబట్టారు. కర్ణాటకలో జరిగిన విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికల్లో దళితులు, మైనారిటీలు అందరు కాంగ్రెస్‌కు ఓటు వేశారని తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెనుమార్పులు కనిపిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 స్థానాల్లో 120 స్థానాలు కచ్చితంగా గెలుస్తామని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు.