Nara Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నాలుగు వారాలుగా జోష్ తగ్గకుండా దూసుకెళ్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు యువగళం షెడ్యూల్ చూస్తే ఊపిరి సలపని బిజీగా రూపొందించారు. ఉదయం క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ లోకేష్, తరువాత వివిధ సామాజికవర్గాల సంఘాలతో సమావేశాలు.. పాదయాత్రలో ముఖాముఖీలు, బహిరంగసభలు, నాయకులతో సమీక్షలు.. పోలీసుల అడ్డంకులు, వైఎస్సార్సీపీ కవ్వింపులను ఎదురొడ్డి మరీ పూర్తి చేస్తున్నారు. నాలుగు వారాలలో గరిష్టంగా రోజుకి 20 కిలోమీటర్లు నడిచిన రోజులున్నాయి. తక్కువ అనుకుంటే 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రోజులున్నాయి. సగటుగా చూస్తే రోజుకి 15 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతోంది. పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం అదే రితీలో యాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ నింబధనలను ఉల్లంగించారంటూ ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది.
12 కేసులు: ఇప్పటి వరకు మొత్తం 12 కేసులు నమోదు చేయగా మొత్తం నమోదైన వాటిలో 9 కేసులకు ఫిర్యాదు దారులు పోలీసులే. వీఆర్వో ఫిర్యాదుపై 1, ప్రైవేటు వ్యక్తుల ఫిర్యాదుపై రెండు కేసులు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లలో లోకేశ్‌తోపాటు అచ్చెన్నాయుడు, అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నాని, దీపక్‌రెడ్డి, పి భువనచంద్రగౌడ్, సుబ్రమణ్యం శెట్టి, ఎన్‌పీ జయప్రకాశ్, జగదీశ్, కోదండ యాదవ్ తదితరులను నిందితులుగా చేర్చారు. మొత్తం 55 మందికి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టారు. లోకేశ్ పర్యటన పలమనేరు, శ్రీకాళహస్తి పూతలపట్టు, కుప్పం, జడీ నెల్లూరు, చిత్తూరు నగరి, సత్యవేడు,తిరుపతి, , చంద్రగిరి నియోజకవర్గాల మీదుగా సాగింది. పోలీస్‌స్టేషన్ల వారీగా చూస్తే కుప్పం, బైరెడ్డిపల్లి , పలమనేరు , నరసింగరాయనిపేట, నగరి, శ్రీకాళహస్తిలలో ఒక్కొక్కటి చొప్పున బంగారుపాళ్యం, ఎస్‌ఆర్‌పురం, ఏర్పేడు రెండు చొప్పున కేసులు నమోదు చేశారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు సృష్టించిన యువగళాన్ని అపేది లేదని టీడీపీ వర్గాలు తేల్చిచెప్పాయి.
రోజువారీ దినచర్య: మరోవైపు లోకేశ్ రోజువారీ దినచర్య పట్ల పార్టీ శ్రేణులు ఆసక్తి చూపుతున్నాయి. నారా లోకేష్ తీసుకునే ఆహారం, వ్యాయామం, నిద్ర సమయంపై సర్వత్ర పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. క్యాంప్ సైటులో ఉదయం 6 గంటలకల్లా నిద్రలేస్తారు. 6.30కి ఫ్రెష్ అయి బ్లాక్ కాఫీ తాగుతారు. 7:00 గంటల వరకూ పేపర్లు, పీఆర్ టీమ్ బ్రీఫింగ్ తీసుకుంటారు. అరగంట పాటు అంటే 7.30 వరకూ వ్యాయామం చేస్తారు. 8 గంటలకు అల్పాహారం తీసుకుని 8:30 వరకూ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.9:30 సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు లీటర్ వరకూ నీరు తాగుతారు. మధ్యాహ్నం 12.00 గంటలకు కొబ్బరి నీళ్లు తీసుకుంటున్న లోకేశ్ మధ్యాహ్న భోజనంగా కూరగాయలతో కూడిన క్వినోవా తిని అల్లం టీ తాగుతారు. అరగంట పాటు నాయకులతో సమావేశం నిర్వహించి తిరిగి నడక ప్రారంభిస్తారు. నడక సమయంలో మరో లీటర్ నీరు తీసుకుంటారు. సాయంత్రం మరో మారు కొబ్బరి నీళ్లు తీసుకుని నాయకులతో సమీక్ష అనంతరం రాత్రి 8 గంటల స్వల్ప ఆహారం తీసుకుంటారు.
ఇవీ చదవండి: