వైకాపా ప్రభుత్వం పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో మండల స్థాయి తెదేపా కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన... సీఎం జగన్ తీరును తప్పుబట్టారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లే బీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. కనీసం ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులను స్వీకరించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయినందుకే... సీఎం జగన్ కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్, అదాని సంస్థల నుంచి లంచాలు భారీ స్థాయిలో ఆశించారని ఆరోపించారు. అందుకే ఆ పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. ఇప్పుడు రాజధాని తీసుకొస్తామని ప్రకటించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఆ పరిశ్రమలు వచ్చుంటే ఉత్తరాంధ్రలో లక్షల మందికి ఉపాధి లభించేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'ప్రధానిగారూ.. అమరావతే రాజధానిగా ఉండేలా చూడండి'