శ్రీకాకుళం జిల్లాలో వీరఘట్టం మండలం కిమ్మి, వంగర మండలం రుషింగి గ్రామాల మధ్య నాగావళి నదిపై నిర్మిస్తున్న వంతెన ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడంలేదు. 2008లో ఇక్కడ జరిగిన పడవ ప్రమాదంలో ఎనిమిది మంది వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదాలను అడ్డుకట్టవేసేందుకు వంతెన నిర్మాణ ఆవశ్యకతను పాలకులు గుర్తించారు. నాలుగేళ్ల అనంతరం 2012లో వంతెన నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారు. రుషింగివైపు బావి, పిల్లరు, శ్లాబు పనులు నిలిచిపోయాయి. ప్రారంభం నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీని నిర్మాణం పూర్తికాకపోవడంతో నదిలో ప్రమాదకర పడవ ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఈ వంతెన పూర్తయితే వంగర, బలిజిపేట, గరుగుబిల్లి తదితర మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ఏడాది రుతుపవనాలు వచ్చేశాయ్. వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ల కాలం రానుంది. భవిష్యత్తులోకూడా బిక్కుబిక్కుమంటూ నదిలో పడవ ప్రయాణాలు సాగించాల్సి వస్తుంది. వీరఘట్టం మండలం కడకెల్ల, వంగర మండలం కోదులగుమ్మడ, చిట్టపుడివలస, రాజులగుమ్మడ, కిమ్మి, రుషింగి, పనసనందివాడ, కందిశ, బిటివాడ, సంగాం గ్రామాల మధ్య నాగావళి నదిపై పడవ ప్రయాణాలు సాగుతుంటాయి. వంతెన నిర్మాణం పూర్తయితే ప్రమాదకర పడవ ప్రయాణాల నుంచి బయటపడతారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ర.భ.శాఖ జేఈ నాగభూషణరావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. రెండు, మూడు నెలల్లో ఈ నిర్మాణ పనులు పూర్తయ్యేల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: విశాఖ ఘటనపై సీఎం ఆరా.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం