ఆమదాలవలస మండలంలోని గాజులు కొల్లివలస ఆర్ఆర్ కాలనీలో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. తులగాం గ్రామానికి చెందిన కలమట తవిటినాయుడు, బృందావతి దంపతులు.. వంశధార నిర్వాసితులు. భూములు కోల్పోయి.. ఆర్.ఆర్ కాలనీలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. అయితే ఆ స్థలం ఆక్రమణకు గురైందంటూ.. అధికారులు జేసీబీ సహాయంతో వారు నిర్మించుకున్న ఇంటిని కూల్చివేశారు.
కక్ష సాధింపునకు దిగుతున్నారు..
ఈ విషయమే పలుమార్లు అధికారులకు, జిల్లా అధికారులకు కలిసినప్పటికీ ఫలితం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీకి ఓట్లు వేయలేదని నెపంతో తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకొని బాధితులకు అండగా నిలవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు..
ఇల్లు నిర్మించుకుంటున్న వారికి ప్రభుత్వం ఎలాంటి పట్టా మంజూరు చేయలేదని తహసీల్దార్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అక్రమంగా ఇల్లు నిర్మిస్తుంటే నిలిపివేయాలని నోటీసులు ఇచ్చామన్నారు. అయినప్పటికీ ఇల్లు నిర్మిస్తుండడంతో తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రసాదరావుతో పాటు రెవెన్యూ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి...: 326ఏ జాతీయ రహదారిలోని నిర్మాణాల తొలగింపు..