హత్యాయత్నం జరిగినప్పటికీ రాజకీయ జోక్యంతో కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఓ కుటుంబం రోడెక్కింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగింది. మున్సబ్ పేటకు చెందిన బోనెల హేమలతను అదే గ్రామానికి చెందిన సూర్యం అనే వ్యక్తి కావాలనే ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టి చంపేందుకు యత్నించాడని బాధితురాలి కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, పైగా దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ప్రమాదంలో గాయపడిన హేమలతతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
ఎస్సై గోపాలరావు ఘటనా స్థలానికి చేరుకొని వారిని వారించే ప్రయత్నం చేశారు. కాసేపటికి బాధితురాలిని 108లో తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అయితే హేమలత, మున్సబ్ పేట గ్రామ వాలంటీరుగా పని చేస్తున్న ఆమె సోదరి తలసముద్రం ఊర్మిళ నిత్యం గ్రామంలో గొడవలు చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊర్మిళ బుధవారం ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిందని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు.. నిజానిజాలు తెలుసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: మన్యంలో తుపాకులు వదిలి.. పాఠాలు చెబుతున్న ఖాకీలు!