- ప్రజల దృష్టి మరల్చేందుకే అచ్చెన్న అరెస్టు
వైకాపా నేతల అవినీతి భాగోతాలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెదేపా నాయకులపై కేసులు పెడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలు వద్దకు వెళ్లిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడులను.. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలకు అన్ని అర్థం అవుతున్నాయని వైకాపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారంతా హెచ్చరించారు.
- సీఎం జైలు జీవితం అందరికీ..
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిందని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు ఆరోపించారు. అచ్చెన్న అరెస్టుపై తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఓ ప్రకటన ఇచ్చారు. వీల్‍ఛైర్‍లో ఉన్న వ్యక్తిని అత్యవసరంగా రిమాండ్‍కు పంపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ 16 నెలల జైలు జీవితం గడిపారు కాబట్టి... అందరికీ జైలు మరక అంటించాలని చూస్తున్నారని... ఆమె ఆక్షేపించారు.
అచ్చెన్నాయుడిని బలవంతంగా విజయవాడ జిల్లా జైలుకు తరలించడంపై తెదేపా నేతలు భగ్గుమన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెదేపా కార్యాలయం వద్ద... ముఖానికి నలుపు రంగు రిబ్బన్లు ధరించి నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
- ప్రభుత్వం దుర్మార్ఘపు ఆలోచన
అచ్చెన్నను జైలుకు తరలించడాన్ని ఖండిస్తూ విజయవాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నేతృత్వంలో నల్ల జెండాలు, ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని అన్నారు.
- కేంద్రం స్పందించాలి
అచ్చెన్నాయుడి అరెస్టును నిరసిస్తూ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని జైలులో పెట్టాలనే ఉద్ధేశ్యంతో... ఆరోగ్యం బాగాలేకపోయినా ఆసుపత్రి నుంచి జైలుకు తరలించడం కుట్ర పూరిత చర్యగా అభివర్ణించారు. కేంద్రం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరారు.
వైసీపీ సర్కారు అచ్చెన్నాయుడి విషయంలో కక్షపూరిత ధోరణి అవలంభిస్తోందని కడప టీడీపీ ఇన్‌ఛార్జీ అమీర్‌బాబు అన్నారు. ఖాజీపేటల మండలంలోనూ తెదేపా నేతలు... ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
- వైకాపా అరాచక పాలనకు నిదర్శనం
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని నెల్లూరు నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, తెదేపా నెల్లూరు నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలలోపు జైలుకు వెళ్లడం ఖాయమని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో అవినీతిపరుడైన ముఖ్యమంత్రి జగన్... మిగిలిన నేతలందర్ని అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఉమామహేశ్వర నాయుడు ఆరోపించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తక్షణమే విడుదల చేయాలని తెదేపా నేతలంతా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విశాఖలో హైఎండ్ ఐటీ స్కిల్ వర్సిటీ: సీఎం జగన్