MLA letter to CM Jagan: రాజ్యాంగంలో భాగమైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల పరిధులు, బాధ్యతలు, అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తోందని మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ చర్చకు వీలు కల్పించేలా శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి శనివారం ఆయన లేఖ రాశారు.
లేఖలో ఏమన్నారంటే..
"అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయదలచుకోలేదు. కానీ రాజధాని మార్చడానికి గానీ, రెండు లేదా మూడు రాజధానులుగా విభజించడానికి గానీ శాసనం చేసే అధికారం శాసనవ్యవస్థకు, విధాన నిర్ణయాధికారం ప్రభుత్వానికి లేదంటూ చేసిన వ్యాఖ్య నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. రాజ్యాంగ సంస్థలుగా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన, కార్య నిర్వాహక, న్యాయవ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్వచించారు. దీన్నే ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘డాక్ట్రెయిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్’గా పేర్కొంటారని రాజ్యాంగంలో ఉంది. మూడు వ్యవస్థలూ తమ పరిధులకు లోబడి, ఒకదాన్ని మరొకటి అతిక్రమించకుండా, ఒక దానిలో ఇంకొకటి జోక్యం చేసుకోకుండా ప్రజలకు సుపరిపాలన అందించటం లక్ష్యంగా ఈ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు.. తమ ముందువారు చేసిన ఘోరమైన తప్పులను చూస్తూ మౌనప్రేక్షకుల్లా ఉండిపోకూడదు. శాసనాలు చేయడం, విధివిధానాలు రూపొందించడం, ప్రజా సంక్షేమానికి, భద్రతకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన చట్టాలు చేయడం రాజ్యాంగం ద్వారా శాసనసభకు సంక్రమించిన హక్కు, బాధ్యత. ఈ హక్కును వినియోగించుకోకపోతే రాష్ట్ర శాసనసభ తన బాధ్యతను విస్మరించినట్లే కదా? ఇలాంటి హక్కును కాదనడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని భావిస్తున్నాను. ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కొన్ని వ్యాఖ్యలను పరిశీలిస్తే శాసనసభ అధికారాలు, బాధ్యత నిర్వహణలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు ఎవరికైనా స్ఫురించక మానదు. అందుకే వ్యవస్థల పరిధులు, బాధ్యతలు, అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది" అని ధర్మాన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
'ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకం... పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయండి'