భావనపాడు పోర్టు కన్నా ముందు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామస్థులు ఆయనతో శనివారం సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణాన్ని, అభివృద్ధిని స్వాగతిస్తామని, అంతకన్నా ముందు తమకు ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించాలని గ్రామస్థులు కోరారు. ప్రభుత్వం తమకు అందాల్సిన పరిహారం ఇప్పించే విషయంలో అండగా నిలవాలని అచ్చెన్నాయుడును కోరారు.
ఎకరాకు రూ.17 లక్షలు పరిహారంగా ఇస్తామని, యూత్ ప్యాకేజీ లేదని అధికారులు చెప్పారని గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామ సభ పెట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ఇప్పించాకే పోర్టు పనులు చేపడతామన్నామని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆనాడు పోర్టు వద్దని దుష్ప్రచారం చేసిన వైకాపా నేతలు నేడు పోర్టు కావాలంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. నిర్వాసితులకు న్యాయం చేశాకే పోర్టు పనులు ప్రారంభించాలని, నియంతృత్వ ధోరణితో వెళ్తే ప్రజల పక్షాన నిలిచి పోర్టు పనులను అడ్డుకుంటామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఇదీ చదవండి