ఆమె కన్నీటితో కడుపు నింపుకొని వారి ఆకలి తీర్చింది..
తాను నిద్రపోకుండా వారికి లాలి పాడి నిద్రపుచ్చింది..
తనకు నడిచే ఓపిక లేకున్నా వారికి నడక నేర్పింది.
ప్రయోజకులను చేసింది.. మురిసిపోయింది..
ఆమె వారికిప్పుడు భారమైపోయింది.. అంతే.. రోడ్డు పక్కన ఏదో ఒక చెత్తను పడేసినట్లు, పనికిరాని కాగితాన్ని బయటకు విసిరేసినట్లు వదిలేసి వెళ్లిపోయారు..
దీర్ఘకాల లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు తల్లిని పోషించలేక రహదారి పక్కన వదిలేసిన సంఘటన ఒడిశాలోని గంజాం జిల్లా భంజనగర్‌లో గురువారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు తక్షణం స్పందించి, వృద్ధురాలిని కాపాడి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కుమారుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
గంజాం జిల్లా జగన్నాథప్రసాద్ పట్టణానికి చెందిన వృద్ధురాలు(65) ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది. వారికి సొంత ఇల్లు లేదు. కుమారులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. లాక్‌డౌన్‌తో పనులు లభించక, తినేందుకు తిండిలేక వారు తల్లిని గురువారం భంజనగర్ శివారున లొహరఖండి ప్రాంతంలో రహదారి పక్కన వదిలేశారు. అక్కడే ఆమె దుస్తులు, ఇతర సామగ్రి ఉన్న సంచుల్ని పడేశారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరు కుమారుల్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: