భావనపాడు ఓడరేవు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందు కోసం నిధులను కేటాయించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరిలో నిర్మాణ పనులకు భూమి పూజ చేపట్టాలని అనుకుంది. రైతుల వద్ద భూసేకరణకు వడివడిగా అడుగులు పడిన సమయంలో.. ఎవరూ ఊహించని మరో అడ్డంకి సింగరేణి రూపంలో తెరపైకి వచ్చింది.
చిక్కుముడి వీడేనా...
1992లో ఉమ్మడి రాష్ట్రంలోని కరీంనగర్ ప్రాంతానికి చెందిన సింగరేణి బొగ్గు గనుల కోసం.. ఆ ప్రాంతంలో ఉన్న అటవీభూములను ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యామ్నాయంగా... సంతబొమ్మాళి మండల తీర ప్రాంతంలో మూలపేటలో ఉన్న భూములను ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించింది. ప్రస్తుతం భావనపాడు-మూలపేట మధ్యలో ఉన్న 335 హెక్టార్ల అటవీభూమి రిజర్వు ఫారెస్టు ఆధీనంలో ఉంది. ఇదే ప్రాంతంలో రెవెన్యూశాఖకు సంబంధించిన 80 హెక్టార్ల వరకు భూములున్నాయి. ఈ ప్రాంతంలో భావనపాడు ఓడరేవు నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించిన ఏపీఐసీసీ అధికారులు.. విచారణ చేపట్టి పోర్టుకు అప్పగించేందుకు డ్రాప్ట్ 4ఏ నోటిఫికేషన్ ఇటీవల జారీచేశారు. సింగరేణి కథ వెలుగులోకి రాగా అటవీశాఖ అధికారులు గతంలో జరిగిన ఒప్పందాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
అధికారుల ఆదేశాలతో...
ఉన్నతాధికారుల ఆదేశాలతో సంతబొమ్మాళి మండలం భావనపాడు, మూలపేటలో.. శనివారం నుంచి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(డీజీపీఎస్) సర్వేను టెక్కలి అటవీశాఖాధికారి పి.వి.శాస్త్రి, తహసీల్దారు ఎస్.రాంబాబు, మండల సర్వేయర్ బాలరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది చేపడుతున్నారు. భావనపాడు-మూలపేట మధ్యలో ఎంత మేర అటవీశాఖ, రెవెన్యూ భూములున్నాయి, రెవెన్యూ, అటవీశాఖ హద్దులు తదితర అంశాలను గుర్తించడానికి సమగ్రంగా సర్వే నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదికను అందించనున్నట్లు సమాచారం. అనంతరం నిపుణులు ఆ ప్రదేశాన్ని గుర్తించి.. ఓడరేవు నిర్మాణానికి అనువైన స్థలమే, కాదో నిర్ధారిస్తారు.
ఇదీ చదవండి: