నాలుగుసార్లు పరీక్ష రాసినా అతన్ని విజయం వరించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడి చదివి అయిదోసారి అనుకున్నది సాధించాడు ఆ యువకుడు. ఎలాగైనా సివిల్స్ ర్యాంకు సాధించాలన్న పట్టుదల ముందు వైఫల్యం తలదించుకుంది. తాతదండ్రుల వద్ద క్రమశిక్షణతో కూడిన విద్యనభ్యసించి ఉన్నతమైన లక్ష్యం వైపు సాగి విజయ తీరాలకు చేరాడు. జాతీయస్థాయిలో సివిల్స్‌లో మెరుగైన ర్యాంకు సాధించి తన కలను నెరవేర్చుకున్నాడు బూర్జ మండలంలోని కండ్యాం గ్రామానికి చెందిన బవిరి సంతోష్. 607 ర్యాంకుతో సత్తాచాటాడు.
సారవకోట మండలం అలుదు గ్రామంలో తాత, విశ్రాంత ఉపాధ్యాయుడు పొన్నాన కృష్ణమూర్తి ఇంట్లోనే ఉంటూ సంతోష్ చదువుకున్నాడు. తండ్రి రాజారావు విశ్రాంత ఉపాధ్యాయుడు కాగా, తల్లి ఉమాకుమారి గృహిణి. పదో తరగతి వరకు జలుమూరు మండలం చల్లవానిపేటలో చదువుకొన్నాడు. ఇంటర్లో 914 మార్కులు తెచ్చుకుని ప్రతిభ చూపాడు. అనంతరం విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని న్యూసెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో ఎండీ డెర్మటాలజిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే, ఐదేళ్లుగా సివిల్స్ సాధించాలనే పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. సంతోష్‌కు సివిల్స్‌లో ప్రతిభ చూపడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: UPSC TOPPER: నాలుగుసార్లు విఫలమైనా.. ఐదోసారి అదరగొట్టేశాడు.!