విశాఖ జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 16వ నెంబర్ జాతీయ రహదారి 6 వరుసల విస్తరణ పనులు గతేడాది ప్రారంభమైనాయి. మూడు ప్యాకేజీలుగా విభజించి నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో పనులు చురుకుగా సాగాయి. ఇంతలో లాక్డౌన్ అమలులోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి విశాఖ జిల్లా ఆనందపురం వరకు 47 కిలోమీటర్ల పొడవునా రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 1,239 కోట్లు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం నుంచి నరసన్నపేట వరకు 54 కిలోమీటర్ల మేర 6 వరసల రహదారి నిర్మాణానికి 1,665 కోట్లు కేటాయించింది.
నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు 110 కిలోమీటర్ల దూరంలో 13.2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు 444.5కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రణస్థలం-ఆనందపురం నడుమ పనులు పూర్తి దశకు చేరుకోగా... రణస్థలం- నరసన్నపేట -ఇచ్ఛాపురం పనులు పూర్తి కావలసి ఉంది. ముఖ్యంగా రహదారి పనులు నిర్మించేందుకు డిసెంబర్ నుంచి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పనులు శరవేగంగా జరిగాయి. కానీ మార్చి నుంచి కరోనా వైరస్ కారణంగా జాతీయ రహదారి పనులు స్తంభించిపోయాయి.
జూన్, జులై నెల నుంచి వర్షాలు ఆరంభం కావడం, పంట కాలువల ద్వారా నీరు విడిచిపెట్టడం వల్ల జాతీయ రహదారి పనులకు ఆటంకం కలుగుతోంది. వచ్చే ఏడాది నాటికి కానీ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తయ్యేలా లేవు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ విషయంపై కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు. ప్రాధాన్యతా పరంగా రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. మొత్తానికి రెండు నెలల తర్వాత 16వ నెంబర్ జాతీయ రహదారి పనులు ప్రారంభమయ్యాయి.
రెండు నెలలుగా జాతీయ రహదారి విస్తరణ పనులు నిలిచిపోవడంతో... పలు ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరిగాయి. నరసన్నపేట మండలం తామరపల్లి-జమ్ము కూడలి పైవంతెన నిర్మాణంలో భాగంగా రోడ్డు ఎత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పాత జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోతుంది. కొత్త రోడ్డు నిర్మాణం పూర్తి కాక పాత రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే ... వర్షాకాలంలో జాతీయ రహదారిపై ప్రయాణం కష్టమవుతుంది.
ఇదీచూడండి. విద్యాశాఖలో 'నాడు-నేడు' అమలుపై సీఎం సమీక్ష