శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రమైన వీరఘట్టంలో ప్రధాన రహదారులపై ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పీవో సీహెచ్ శ్రీధర్, పాలకొండ ఆర్టీవో టీవీఎస్ కుమార్ ఆధ్వర్యంలో యంత్రాల సాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు. వీరఘట్టం పట్నం ప్రారంభం నుంచి మార్కెట్ కమిటీ మొదలుకొని పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారిలో ఉన్న 134 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన రహదారి కేవలం 25 అడుగులు మాత్రమే ఉంది. ఈ విస్తీర్ణాన్ని 66 అడుగులకు మార్చేందుకు అధికారులు నిర్ణయించారు. అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ మార్గం ఇరుగ్గా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరగటంతో పాటు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఎట్టకేలకు ఐటీడీఏ పీవో ఈ ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఉదయం ఆరు గంటలకే వీరఘట్టం చేరుకున్న పీవో స్థానిక అధికారులతో కలిసి రహదారులపై అక్రమ కట్టడాలను తొలగించే చర్యలు చేపట్టారు. మరోవైపు సీతంపేట మండల కేంద్రంలోనూ ఆక్రమణలపై దృష్టి సారించారు. ఇప్పటికే విస్తరించిన రహదారిలో కాలువకు లోపల ఐదు అడుగుల వరకు ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు.
ఇదీ చదవండీ.. godavari: ఎరుపెక్కిన గోదారి..మీసాల రొయ్య!