Ratha saptami celebrations: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలకు.. దేవాదాయశాఖ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్... స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వేడుకల్లో... దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణతో పాటు మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, ఎస్పీ జీఆర్ రాధిక, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు దర్శనానికి బారులు తీరారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినా.. ఏర్పాట్లు బాగాలేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు గగ్గోలు పెడుతున్నారు.
టెక్కలిలో పద్మిని ఛాయాదేవి సమేత సూర్యభగవానుని ఆలయం: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పద్మిని ఛాయాదేవి సమేత సూర్యభగవానుని ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. క్షరాభిషేకం అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
మార్కాపురంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయం: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనం మొదలుకొని.. రాత్రి చంద్రప్రభ వాహనం వరకు సప్త వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి వారు మాడ వీధుల్లో విహరిస్తారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారిని వెండి రథంపై ఊరేగించనున్నారు. ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
వేదమంత్రాల నడుమ పూజలు: రథసప్తమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు చేశారు. విశాఖ సాగర తీరంలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సూర్యనారాయణ స్వామికి వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించారు.
తణుకులోని శ్రీ సూర్య దేవాలయం: పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని శ్రీ సూర్య దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిపారు. జిల్లాలోని వివేకానంద యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 12 రకాల సూర్య నమస్కారాలు చేశారు. కర్నూలులో పతాంజలి యోగా కేంద్రంలో సూర్యభగవానుడికి పూజలు చేసి సూర్య నమస్కారాలు చేశారు.
ఇవీ చదవండి: