శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆది ఆంధ్రావీధిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఆది ఆంధ్రావీధిలో 18 నాటుబాంబులను స్వాధీనం చేసుకుని..ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఎర్ర రాజేష్, రుంకు నవీన్ అడవిపందుల వేటకు వెళ్తుండగా... మెళియాపుట్టి రహదారి ఫ్లైఓవర్ వద్ద పోలీసులకు 18 నాటుబాంబులతో పట్టుబడ్డారు. ఆది ఆంధ్రావీధిలో కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సీఐ నీలయ్య, ముగ్గురు ఎస్సైలు, 60 మంది పోలీసు సిబ్బంది కార్డన్ సర్చ్ చేపట్టారు. ప్రతి ఇంట్లో విస్తృతంగా సోదాలు చేసి.. వాహనాల పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆది ఆంధ్రావీధిలో ఇప్పటికే పలుమార్లు నాటుబాంబులు పేలి పందులు చనిపోయిన సంఘటనలు వెలుగుచూశాయి. సోదాల అనంతరం ఆ ప్రాంత ప్రజలతో డీఎస్పీ సమావేశం ఏర్పాటుచేశారు. నాటుబాంబులు తయారీ, వినియోగం, ఆడవిపందుల వేట, నాటుసారా అమ్మకాలు వంటివి మానుకోవాలని హితవు పలికారు. పునరావృతమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినచర్యలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి. తిరుమలలో పెరిగిన భక్తులు