Fight For Ration in Narasannapeta: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం కరకవలస గ్రామంలో 382 తెల్ల రేషన్ కార్డుదారులున్నా ప్రతి నెల 200 లోపు రేషన్ కార్డు దారులకు మాత్రమే బియ్యం అందుతున్నాయి. ఇదేమిటని రేషన్ డీలర్ని ప్రశ్నించిన గ్రామస్థులకు.. ప్రతిసారి స్టాక్ అయిపోయిందనే జవాబే వినిపిస్తుందంటున్నారు. నిత్యావసరాలు అందలేని వారందరూ వృద్ధులే.. రేషన్ డీలర్, పౌరసరఫరాల అధికారులు కుమ్మక్కవడంతోనే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామంటున్నారు.
అధికారుల అవినీతి .. ఖాళీ కడుపులు: కరకవలస గ్రామంలో అధిక శాతం వృద్ధులే ఉన్నారు. వారికి ప్రతి నెల రేషన్ బియ్యం వస్తేనే కడుపు నిండేది. పౌర సరఫరాల అధికారులు అవినీతి కారణంగా ఒక పూట తింటే మరొక పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని, ప్రతి నెల 1వ తారీఖు నుండి 15 వ తారీఖు లోపు బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆ సమయంలో ఇవ్వని రేషన్ డీలర్ గడువు ముగిసిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఇస్తున్నారని.. వృద్ధులు, వికలాంగులకు చేతిముద్రలు పడినా పడటం లేదని, సాంకేతిక లోపం పేరుతో రేషన్ డీలర్ మోసం చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో ప్రతి నెలా అరకొరగా సగం మాత్రమే ఇచ్చే రేషన్ కార్డుదారులకు ఇచ్చిన బియ్యం తూకంలో కూడా మోసం చేస్తున్నారనీ, ప్రభుత్వం అందించిన నాణ్యమైన బియ్యాన్ని పక్కదోవ పట్టించి తమకు దేవాలయాల్లో భక్తులు దానంగా ఇచ్చిన బియ్యాన్ని ఇస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు.
ఆకలి చావులు.. ఆవేదన: గ్రామంలో రేషన్ సరిగ్గా అందక అర్థాకలితో పడుకునే కుటుంబాలు ఎక్కువయ్యాయని సర్పంచ్ వాపోతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించకుంటే ఆకలి చావులు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి