శ్రీకాకుళం జిల్లాలో వైఎస్‌ఆర్ పింఛను కానుక లబ్ధిదారుల సంఖ్య సుమారు 3,47,798కి చేరింది. వీరందరికీ పంపిణీ చేయాలంటే 83 కోట్ల 72 లక్షల మేర నగదు అవసరమవుతుందని అధికారుల అంచనా వేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి పంపిణీ చేపట్టనున్నందున ఆలోగా బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఠంచనుగా పంపిణీ ప్రారంభమయ్యేది. జులై నెలలో మాత్రం 8వ తేదీ నుంచి పంపిణీ చేపట్టాలని ఆదేశాలు అందాయి. నూతన ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పథకమైనందున... పంపిణీకి వైఎస్ జయంతి రోజును ఎంచుకున్నారు. ఇప్పటివరకు 2 వేలు అందిస్తున్న పింఛనును ఇకనుంచి 2,250 రూపాయలు అందించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని సంబరంగా నిర్వహించాలని అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ఎంతో మందికి లబ్ధి
గతంలో దివ్యాంగులకు వైకల్య శాతం ఆధారంగా పింఛను లబ్ధి ఉండేది. ఇప్పుడు వైకల్యంతో సంబంధం లేకుండా అందరికీ 3 వేలు చొప్పున పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. వృద్ధాప్యం, వితంతు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, డప్పుకళాకారులు, చర్మ కార్మికులకు 2 వేల 2 వందల 50 చొప్పున పంపిణీ చేస్తారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలసిస్ చేయించుకుంటే 10 వేలు చొప్పున ఇస్తారు. వీరందరికీ కూడా ఈనెల 8వ తేదీ నుంచి పంపిణీ చేస్తారు. లబ్ధిదారులందరికీ నగదు అందజేస్తామని.. కోట్ల కొద్దీ నగదు అవసరమైనందున సిద్ధం చేసుకోవాలని బ్యాంకులకు చెప్పామని కలెక్టర్ తెలిపారు. 8వ తేదీన పింఛన్ల పంపిణీకి సంబధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.