జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రణస్థలం వద్ద చేపట్టాల్సిన బైపాస్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. సేకరించిన భూములకు ధర చెల్లింపు విషయంలో అటు హైవే అధికారులకు, ఇటు రైతులకు మధ్య అంగీకారం కుదరడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి మా భూముల్లో బైపాస్ నిర్మించుకోవచ్చని రైతులు చెప్పినప్పటికీ భూమి ధర అధికంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని ధర ఇక్కడ నిర్ణయించారని ధరలో 30 శాతం తగ్గిస్తే తప్ప బైపాస్ నిర్మించలేమని వారు భీష్మించుకు కూర్చోవడంతో ఈ నిర్మాణం ఊగిసలాటలో పడింది. ఆకాశ వంతెన నిర్మిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచన చేస్తుండటంతో అటు రైతుల్లోనూ, ఇటు వ్యాపారుల్లోనూ గుబులురేగుతోంది.
ఉన్నతాధికారులకు నివేదించినా.. : గతంలో అవార్డు పాస్ చేసిన ధరలే చెల్లించాలని జిల్లా ఉన్నతాధికార్లు హైవే అధికారులకు పలు దఫాలు లేఖలు రాశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఇబ్బందే...: ఇలాంటి పరిస్థితుల్లో ఆకాశ వంతెన నిర్మిస్తే మండల కేంద్రమైన జేఆర్‌పురం కూడలి పూర్తిగా ధ్వంసమయ్యే ఆస్కారముంది. ఆ రహదారిపై వెయ్యి కుటుంబాలు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఇబ్బందుల్లో పడతారు.
బైపాస్ ఎక్కడ : రణస్థలం వద్ద
ఎన్ని కిలోమీటర్లు : 3.5
అవసరమైన భూమి : 60 ఎకరాలు
రెవెన్యూ పరిధి : గరికిపాలెం, రణస్థలం, లావేరు మండలం రావివలస
మూడేళ్ల కిందట నిర్ణయించిన ధరలు : గరికిపాలెం రెవెన్యూ పరిధిలో పల్లం భూమికి సెంటుకు రూ.2,63,000లు, మెట్ట భూమికి సెంటుకు రూ.2,62,000, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గరికిపాలెం రెవెన్యూలో సెంటుకు రూ.3,06000లు, రణస్థలం రెవెన్యూలో జాతీయ రహదారికి ఆనుకొని సెంటుకు రూ.2,59,000లు
● చెల్లించాల్సింది : రూ.87,27,57,845
● అవార్డు పాస్ చేసిన సంవత్సరం : 2018 ఏప్రిల్
● ఇబ్బందులు పడుతున్న రైతులు : 394
సమస్య ఇదీ : భూసేకరణ చట్టం ప్రకారం అక్కడ ఉన్న మార్కెట్టు ధరకు అదనంగా ప్రభుత్వం పెంచిన ధర ప్రకారం ధర నిర్ణయించారు. మూడేళ్ల కిందట నిర్ణయించిన ధరను చెల్లించకుండా ప్రస్తుతం 30 శాతం తగ్గిస్తామని చెబుతున్నారని ఇదేమి న్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రణస్థలం, గరికిపాలెం రెవెన్యూ పరిధిలో బహిరంగ మార్కెట్‌లో జాతీయ రహదారికి ఆనుకొని సెంటు రూ.10 నుంచి 15 లక్షల ధర పలుకుతోంది.
నష్టపోయాం
బైపాస్ కని భూములు సేకరించి మధ్యలోనే వదిలేశారు. భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ వల్ల అటు భూమిని విక్రయించుకోలేక పోతున్నాం ఇటు ప్రభుత్వం చెప్పిన ధర రాక ఇబ్బందులు పడుతున్నాం.ఇప్పటికే నష్టపోయాం. గతంలో నిర్ణయించిన ధర చెల్లిస్తేనే భూములిస్తాం. లేకుంటే ఇవ్వం.
- బి.అప్పారావు, బైపాస్‌లో భూమిని కోల్పోయే రైతు
కలెక్టరే నిర్ణయించాలి
హైవే అధికారులు ధరను తగ్గించమంటున్నారు. రైతులతో చర్చించినా. వారు ససేమిరా అంటున్నారు. ధర తగ్గిస్తేనే బైపాస్ నిర్మాణం చేపడతాం. లేకుంటే ఆకాశవంతెన నిర్మించాలని భావిస్తున్నాం. జిల్లా కలెక్టరు ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదిక బట్టే ఇది ఉంటుంది. ఆయన నిర్ణయమే తుది నిర్ణయం. - శివశంకర్, హైవే పీడీ, విశాఖపట్నం
ఇవీ చదవండి