LOKESH BIRTHDAY CELEBRATIONS : తెలుగుదేశం యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినాన్ని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని కాంక్షించారు. ముఖ్యంగా ఆయన ఈ నెల 27 నుంచి చేపట్టబోయే యువగళం పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు కలగకూడదని ఆలయాల్లో పూజలు చేశారు.
నిమ్మాడలో యువగళం పోస్టర్ రిలీజ్: యాత్ర విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో .. లోకేశ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువగళం పోస్టర్‌ను ఆవిష్కరించారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. లోకేశ్ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికాకరులు తొలగించడం వివాదాస్పదమైంది. అధికారుల అత్యుత్సాహం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువగళం యాత్ర సక్సెస్ కావాలని విజయవాడలో 11 రకాల హోమాలు: లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా... తెలుగుదేశం అనుబంధ విభాగాల అధ్యక్షులు... విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున.. మహా హోమం నిర్వహించారు. యువగళం యాత్ర విజయవంతం కావాలని కాంక్షిస్తూ.. 11 రకాల హోమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో... దేవినేని ఉమ ఆధ్వర్యంలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేపట్టారు. స్థానిక వినాయకుడి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి.. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి.. అక్కడ వేడుకల్లో ఉమ పాల్గొన్నారు. పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూస్తోందంటూ విమర్శలు చేశారు.
లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని కొబ్బరికాయలు కొట్టిన నేతలు: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో.. టీడీపీ నేత ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో.. సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి... లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థనలు చేశారు. లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు తిరుపతిలో ప్రత్యేక పూజలు చేశారు. యువగళం విజయవంతం కావాలని కోరుతూ... అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద 400 కొబ్బరికాయలు కొట్టి.. ప్రార్థించారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని జనార్దన స్వామి ఆలయం నుంచి దేవీచౌక్ కూడలి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి ప్లకార్డులు చేతపట్టి.. పాదయాత్ర చేపట్టారు. యువగళం కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే ముఖ్యమంత్రి జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని... టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌చౌదరి హెచ్చరించారు.
వరుపుల రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో.. తెలుగుదేశం నేత వరుపుల రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా... ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు వద్ద జాతీయరహదారిపై మరోసారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వరుపుల రాజా పాదయాత్రగా తరలివెళ్లారు. అనకాపల్లిలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బెలూన్లు ఎగరవేసి లోకేశ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
ఇవీ చదవండి: