MP Rammohan Naidu: తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష.. సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారనే నెపంతో సీఐడీ అధికారులు ఆమెకు నోటీసులివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశమయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాష్టీకాలు, రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిని అరెస్టు చేస్తోందని మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో ఆమెపై తప్పుడు కేసులు పెట్టడం తగదన్నారు. సామాజిక మాధ్యమంలో ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్ చేశాననే విషయాన్ని ఆమె ధైర్యంగా ఒప్పుకొన్నారన్నారు. ఇప్పటికే తమ పార్టీ నేతలు కె.అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు.
రాష్ట్రంలో ఎన్నో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా స్పందించకుండా.. ఎవరో పెట్టిన పోస్టుపై స్పందించిన శిరీషకు సీఐడీ నోటీసులివ్వడం ఏంటని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. శిరీష మాట్లాడుతూ ఏ తప్పూ చేయకపోయినా తనను పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకంతో సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులను గౌరవిస్తూ.. సోమవారం అమరావతి వెళ్లి తన వాదన వినిపిస్తానన్నారు.
సమావేశంలో జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత పాల్గొన్నారు.
ఇవీ చూడండి: