శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల తరుపున ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ బాబు.. 4, 5 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాల అందించి.. తమ అభ్యర్ధిని ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
ప్రచారం ముమ్మరం చేసిన ప్రధాన పార్టీల నేతలు..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తికావటంతో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు అయ్యారు. దీంతో ప్రధాన పార్టీల నేతలు సైతం తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలంటూ ప్రచారం ముమ్మరం చేశారు. వైకాపా తరపున 4,5 వార్డుల్లో పాలకొండ శాసనసభ సభ్యురాలు కళావతి, మాజీ డీసీసీ అధ్యక్షులు విక్రాంత్ ప్రచారంలో పాల్గొన్నారు. తెదేపా తరఫున ఐదో వార్డులో నియోజకవర్గ బాధ్యుడు నిమ్మక జయకృష్ణ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. భాజపాకి సంబంధించి 9, 11 వార్డుల్లో ఆ పార్టీ నాయకులు పైడి వేణుగోపాల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ...
జిల్లాలోని పాలకొండలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక వార్డుల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సందర్శించారు. వెంకంపేట, పెద్ద కాపు వీధి పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై డీఎస్పీ శ్రావణి, శంకర్రావు, ఎస్ఐ సీహెచ్ ప్రసాద్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కార్గిల్ కూడలిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పరిశీలించారు.
ఇవీ చూడండి...: 'పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే.. దేశం సౌభాగ్యంగా ఉంటుది'