Marriages at nuvvalarevu: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో గురువారం ఒకే ముహూర్తానికి దాదాపు 45 వివాహాలు జరిగాయి. ఈ సామూహిక వివాహాలు ఏ దేవస్థానం ఆధ్వర్యంలోనో, మరే స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనో జరిగినవి కాదు. వీటికి మూలం తెలుసుకోవాలంటే.. ముందు ఈ ఊరి ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి.
దాదాపు 2 వేల 500కు పైగా కుటుంబాలుండే నువ్వులరేవు జనాభా.. 12 వేలకుపైమాటే. వీరంతా కేవిటీ కులస్థులు. చేపల వేటే వీరి ప్రధాన జీవనాధారం. బృందావతి అమ్మవారు.. గ్రామ దేవత. శ్రీరాముడు ఆరాధ్య దైవం. ఇక్కడ శ్రీరామ నవమి తర్వాత.. సామూహిక వివాహాలు జరుగుతాయి. ఇక్కడే గ్రామంలో అనాదిగా సంప్రదాయం నడుస్తోంది. జంటలను.. ఊళ్లో నుంచే ఎంపిక చేస్తారు. ఎందుకంటే ఆడపిల్లలను వేరే ఊరికి పంపరు... బయటనుంచి తెచ్చుకోరు. వివాహం కూడా అమ్మాయి ఇంటి వద్దే జరిపిస్తారు.
ఒకే లగ్నంలో.. అన్ని జంటలతో మాంగల్యధారణ చేయిస్తారు. కాకపోతే వరుడే కాదు.. పెళ్లికూతురు కూడా పెళ్లి కుమారుడి మెడలో తాళి కడుతుంది. ఆ తర్వాత పెళ్లి పీటలపై సంప్రదాయ బల ప్రదర్శన, గవ్వల పోటీలు ఉంటాయి. ఈ పెళ్లి సందడి ఊళ్లో ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు.
నువ్వులరేవులో.. పెళ్లి భాజాలు రెండేళ్లకోసారే మోగుతాయి. అంటే మళ్లీ 2024లోనే ఈ ఊళ్లో పరిణయాలు. పూర్వం నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే ఖర్చులూ తగ్గుతాయంటున్నారు గ్రామస్థులు. పెళ్లి వేడుకకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బంధుమిత్రులు. ఈ ఊరి ఆచారం భలే ఉందండోయ్ అంటూ ఖుషీ అయ్యారు.
ఇదీ చదవండి: