విద్యార్థులకు అందించనున్న కిట్ ఇదే..
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ను విద్యాశాఖ అధికారులు అందించారు. కొవిడ్ కారణంగా ఇప్పటికే పాఠశాలల ప్రారంభం రెండు పర్యాయాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా అక్టోబరు 5వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్నందున వాయిదా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు.
ప్రస్తుత విద్యార్థులకే...
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మాత్రమే విద్యాకానుక పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారికి మాత్రం ఈ కానుకలు ఇప్పట్లో పంపిణీ చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులవైపు అధిక సంఖ్యలో చేరారు. జిల్లాలో కొత్తగా చేరినవారు సుమారుగా 12 వేల మందికి పైగా ఉంటారు.
●కిట్‌లో ఉండేవి ఇవే...
జగనన్న విద్యాకానుక కిట్‌లో మూడు జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఒక బ్యాగు, బెల్టు, మాస్కు ఉంటాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కిట్లను డీఈవో కుసుమ చంద్రకళ అందించారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.