శ్రీకాకుళం జిల్లా పాలకొండ - విశాఖపట్నం రహదారి పేరు చెబితే జనం భయాందోళనకు లోనవుతున్నారు. రాజాం మీదుగా పాలకొండ వరకు ఈ రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారింది. గుంతల కారణంగా వాహనాలూ దెబ్బతింటున్నాయి. రాజాం - పాలకొండ మధ్య ఉన్న 21 కిలోమీటర్ల ప్రయాణానికి రెట్టింపు సమయం పడుతోంది. ఫలితంగా సకాలంలో గమ్యస్థానాలకు చేరకోలేకపోతున్నామని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు.
రద్దీ పెరిగినా నోచుకోని విస్తరణ...
ఈ రహదారిపై రద్దీ పెరుగుతోందని రోడ్లు భవనాల శాఖ గుర్తించినా అందుకు తగ్గట్లు విస్తరణ పనులు జరగడం లేదు. గతేడాది నుంచి నేటివరకు 14 రోడ్డు ప్రమాదాలు జరగగా.. నలుగురు మృత్యవాతపడ్డారు. 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతుకులు, దుమ్ము, ధూళితో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అంచనాలకే పరిమితం...
గతంలో విజయనగరం నుంచి హడ్డుబంగి వరకు రూ.8.3 కోట్లతో రహదారిని విస్తరించి.. టోల్గేట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. కానీ ఇవి అమలు కాలేదు. తాజాగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ద్వారా నిధులు మంజూరుకు మార్గం సుగమమైంది. రూ.56.9కోట్లు నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాజాం పట్టణంలో చీపురుపల్లి, పాలకొండ రహదారుల విస్తరణకు రూ.20 కోట్లు అవసరమని ప్రతిపాదించినా.. నేటికీ నిధులు మంజూరు కాలేదు. ఇలా ఎనిమిది ఏళ్లుగా ప్రతిపాదనలకే ఈ రహదారి పరిమితం అవుతుందే తప్ప నేటికీ విస్తరణకు నోచుకోకపోవడం శోచనీయం.
ఇదీచదవండి.