కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నేడు శ్రీకాకుళం జిల్లా పొందూరులో పర్యటించనున్నారు. జాతీయ చేనేతకారుల దినోత్సవం సందర్భంగా ఉదయం పదిన్నరకు ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘాన్ని నిర్మలా సందర్శించనున్నారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ పథకాల సహాయాన్ని వారికి అందిస్తారు. ప్రభుత్వ శాఖలతో పాటు బ్యాంకులకు సంబంధించిన 50 ప్రదర్శనశాలలను కేంద్ర మంత్రి సందర్శిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లను కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
నిర్మలా సీతారామన్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు.. కేంద్ర మంత్రిని అడ్డుకుంటారనే హెచ్చరికలతో భద్రతను పెంచారు. నిర్మలా సీతారామన్ పర్యటనలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.
ఏర్పాట్లు పూర్తి..
శ్రీకాకుళం జిల్లా పొందూరులో ఇవాళ కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించనున్నారు . మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బి. లాట్కర్, ఎస్పీ అమిత్ బద్దార్.. ఖాదీ పరిశ్రమ, వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే బహిరంగ సమావేశంలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి:
విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థికమంత్రి.. కార్మిక సంఘాల నేతల ముందస్తు అరెస్ట్