CROP DAMAGE DUE TO UNTIMELY RAIN: రాష్ట్రం వ్యాప్తంగా భానుడి భగభగలతో ప్రజలు ఉక్కపోతకు గురవుతుంటే.. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షాలు ఈ వారంలో రైతుల్ని దెబ్బతీశాయి. లావేరు, జి.సగడం, ఎచ్చెర్ల, రణస్థలం, గార మండలాల్లో.. సుమారు 1,600 ఎకరాల్లో అరటి, మామిడి, చెరకు, మినుము, పెసర పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో తీవ్ర నష్టం రావడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు అధికారులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరొక నెలలో మామిడి పంట చేతికి వచ్చే దశలో వడగళ్ల వానతో కాయలు నేల రాలిపోయాయి. మామిడికాయలకు మచ్చలు ఏర్పడి కిందకి రాలిపోవటంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడంలేదని రైతులు వాపోతున్నారు. అంతా బాగుంటే ఒక్కో మామిడికాయ లోడుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం మామిడి కాయలుకు మచ్చలు రావడంతో ఒక మామిడి లోడును నాలుగు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల రూపాయలు అప్పులు చేసి పంట కోసం పెట్టుబడి పెడితే.. అకాల వర్షం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని.. లేకపోతే తాము వచ్చే ఏడాది పంటలు పండించే పరిస్థితిలో లేమని అంటున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎలా కట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వమే తమకు దారి చూపాలని రైతులు వాపోతున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంట పనికి రాకుండా పోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అరటి రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ఈ అకాల వర్షాలు మినుము రైతుల్ని నిండా ముంచేశాయి. అప్పులు చేసి పంటకు పెట్టుబడిగా పెడితే.. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు వాపోతున్నారు. అధికారులు త్వరగా నష్టపరిహారం లెక్కించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
"ఎకరానికి 25 నుంచి 30 వేల రూపాయల పెట్టుబడి పెట్టాము. అకాల వర్షాల కారణంగా 100 ఎకరాల మినుప చేను, 200 ఎకరాల మామిడి తోట, మరో వంద ఎకరాల అరటి తోటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎక్కడో మిగిలి ఉన్న మామిడికాయలకు కూడా మచ్చలు వచ్చేశాయి. ఇప్పటి వరకూ ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించి మమల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము." - సుంకర అప్పన్న, మామిడి రైతు
ఇవీ చదవండి: