Drinking Water Problem: చూశారా.. సముద్ర, నది ఒడ్డున గుంతలు తవ్వి.. నీటి కోసం తీరగ్రామాలు పడుతున్న అవస్థలు! ఆ నీరే వారికి ప్రాణాధారం. రోజూ ఖాళీ బిందెలతో మూడు కిలోమీటర్ల దూరాన్ని తోట్ల వెంబడి నడిచి.. తీరాని చేరుకుంటారు. అక్కడ రెండు నుంచి మూడు గంటల పాటు నిరీక్షించి.. గుక్కెడు నీటిని తోడుకుని మళ్లీ ఇంటికి చేరుకుంటారు. తాగునీటి ఎద్దటితో ఇది వాళ్ల జీవితంలో నిత్యకృత్యమైపోయింది. సేకరించిన నీటిని కాచి వడగట్టి.. దాహాన్ని తీర్చుకుంటున్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఈ సమస్య వారికి మరింత రెట్టింపు అవుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు ఉపాధి లేక జనం వలస బాటపడుతుంటే.. తాగేందుకు నీరు లేక జనాలు అలమటిస్తున్నారు. గుక్కెడు నీటి కోసం ఉపాధి పనులను కూడా వదులుకుని గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. నాగావళి, వంశధార, మహేంద్రతనయ వంటి నదులు ఉన్నా.. వాటిని ఆనుకొని ఉన్న పల్లెల్లో మాత్రం ఇప్పటికీ దాహం కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామమైన పెద్ద లక్ష్మీపురం గామస్థులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. అందుబాటులో మంచినీటి పథకాలున్నా.. అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. గత్యతంరం లేక.. సముద్ర ఊటనీటి మీదే ఆధారపడాల్సి వస్తోందని.. గ్రామస్థులు వాపోతున్నారు.
పాతపట్నం నియోజకవర్గంలోని దబ్బపాడు గ్రామ ప్రజల పరిస్థితి కూడా ఇందుకు భిన్నం కాదు. నదీ, సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుకను ఐదు అడుగుల లోతు వరకు తవ్వి.. నీటి చెలమల ద్వారా నీటిని సేకరిస్తున్నారు. ఉదయాన్నే 5 గంటల నుంచి గ్రామస్థులు.. చెలమల దగ్గర క్యూ కడితేనే గానీ బిందెడు నీరు దొరకడం లేదని వాపోతున్నారు. అపరిశుభ్రమైన నీటిని తాగడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని చాలా సార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులతో మొరపెట్టుకున్నా నీటి కష్టాలు తీరడంలేదని వాపోతున్నారు.
"మాకు తరాల నుంచి తాగునీటి సమస్య ఉంది. సముద్ర తీరంలో నీటి చెలమలను తీసుకుని వెళ్తున్నాము. వాటిని తాగేందుకు మరగబెట్టుకునే క్రమంలో నీటిమీద నురుగ ఏర్పడుతుంది. ఈ నీటిని తాగటం వల్ల పళ్లు పసుపుపచ్చగా మారుతున్నాయి. దీంతోపాటు పెరాలసిస్, కాళ్లు నొప్పులు, ముడుకుల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి." - శకుంతల, పెద్దలక్ష్మీపురం
ఇవీ చదవండి: