Drinking water Crisis in srikakulam: మండు వేసవిలో శ్రీకాకుళం ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్నారు. పట్ఠణాలు, పల్లెలు అనే తేడా లేకుండా బిందెడు నీటి కోసం బోరు మంటున్నారు. ఉన్న కుళాయిల నుంచి రెండు, మూడ్రోజులకోసారి నీరు వదులుతుండగా అవి ఏమాత్రం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. పట్ఠణాల్లో వారానికోసారి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుండగా.. అవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీరందక, గొంతు తడవక... ఉన్ననీరే ఉసూరుమని తాగుతున్నారు.
పెరుగుతున్న జనాభాకు సరిపడా నీటి సరఫరా ఏర్పాట్లు లేకపోవడం.. ప్రస్తుత దుస్థితికి కారణమని పట్టణ ప్రజలు చెబుతున్నారు. శ్రీకాకుళంలోని ఓ వార్డు మొత్తానికి ఒకటే కుళాయి ఉంది. దానికి కూడా రెండ్రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఆ కొద్దిపాటి నీటిని పట్టుకునేందుకు పనులు మానుకుని ఎదురుచూస్తే.. అర్థగంటలోనే ఆపేస్తున్నారని మహిళలు వాపోతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఈ మాత్రం సరఫరా కూడా లేదు. రక్షిత మంచినీటి వ్యవస్థ మరుగున పడిపోవడంతో వారానికోసారి ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నారు. అది కూడా రెండు, మూడు బిందెలు పట్టుకునేసరికే గగనమైపోతుందని.. ఆ నీటినే దాచుకుని తాగాల్సి వస్తుందని అంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా సరఫరా చేసే నీరు సరిపోక, మరికొన్ని చోట్ల కుళాయిల నుంచి వచ్చే నీరు తాగేందుకు అనువుగా లేకపోవడంతో పురాతన బావులు, వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు.
సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిద్దామంటే ఓట్లు అడిగేందుకు గ్రామాల్లోకి వచ్చిన నాయకులు ఆ తర్వాత ఇంత వరకూ కనిపించడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత దుస్థితి చూసైనా పాలకులు కళ్లు తెరిచి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని సిక్కోలు వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'ఒంటరిగా ఉంటున్నా..పెళ్లికూతురిని చూడండి'.. మంత్రి రోజాకు వృద్ధుడి వింత విజ్ఞప్తి