రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. స్థానికంగా ఉపాధి దొరక్క అధికశాతం ప్రజలు పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు.. అభివృద్ధికి దూరంగా.. సమస్యలకు దగ్గరగా జీవనం సాగిస్తున్నారు ఇక్కడ జనం.. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తిస్థాయిలో పరిష్కారం చూపలేకపోతున్నారు. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు, క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు వేదికగా నిలవాల్సిన డీఆర్సీ (జిల్లా సమీక్ష సమావేశం) కొత్త సర్కారు వచ్చిన తర్వాత ఇప్పటివరకూ జరగలేదు. ఇతర జిల్లాల్లో ఒకటి రెండుసార్లు జరిగినా ఇక్కడ మాత్రం ఆ ఊసేలేదు.
శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో డీఆర్సీ సమావేశం జరగాల్సి ఉంది. గతంలో సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేసినా పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రస్తావన రావడంతో అదికాస్త రద్దయింది. తర్వాత అధికారులు, అటు ప్రజాప్రతినిధులకు ముహూర్తం కుదరకపోవడం గమనార్హం. 2018 ఆగస్టులో అప్పటి కలెక్టర్ ధనుంజయరెడ్డి అధ్యక్షతన జిల్లాలో ఆఖరి డీఆర్సీ జరిగింది. తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ దాని ఊసేలేదు.
జిల్లాలో పది శాసనసభ నియోజకవర్గాల్లో రెండుచోట్ల తెదేపా మిగిలిన చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇందులో తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకరుగా వ్యవహరిస్తుండగా మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో ఉన్నారు. కలెక్టర్ అధ్యక్షతన డీఆర్సీ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి అన్ని శాఖల ముఖ్య అధికారులు తప్పనిసరిగా హాజరవుతారు. ఒక్కో శాఖ పనితీరు ఎలా ఉందనే ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆరా తీస్తారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గంలోని సమస్యలపై ప్రస్తావించవచ్చు. వాటి పరిష్కారాల కోసం వివరణ కోరవచ్చు. అన్ని శాఖలపైనా సమీక్షించేందుకు ఈ వేదిక ఉపయుక్తంగా నిలుస్తుంది.
ఎన్నో సమస్యలు..
జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. టెక్కలి సహా అటువైపు ఉన్న కొన్ని మండలాల రైతులు వేసిన పంటలకు సాగునీరందని దుస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక ఇంకా కొంతమంది రైతన్నలు అవస్థలు పడుతూనే ఉన్నారు. పంట అమ్ముకున్న అన్నదాతకు సొమ్ము కూడా అందని వైనం. మరోపక్క వేసవి వచ్చేసింది. ఎక్కడికక్కడే తాగునీటికి కష్టాలు మొదలయ్యాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మహిళలు పానీపట్టు యుద్ధాలు చేస్తున్నారు. అనేకచోట్ల రక్షితనీటి పథకాలున్నా పనికిరాకుండా వృథాగా పడిఉన్నాయి.
జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.వందల కోట్లు నిధులు మంజూరైనా అవి అసంపూర్తిగా నిలిచాయి. మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. రూ.466 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఆఫ్‌షోర్ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియని పరిస్థితి. రూ.700 కోట్లతో తలపెట్టిన ఉద్దానం ప్రాంతానికి మంచినీరు అందించే ప్రాజెక్టులో జాప్యం ఎక్కడ జరుగుతుందో తెలియని పరిస్థితి. తోటపల్లి ప్రాజె క్ట్టులో భాగంగా జరుగుతున్న ఆధునికీకరణ పనుల్లో జాప్యానికి గల కారణాలు తెలియడం లేదు.
ఇలా ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయి. వాటి పనులు ఏమేరకు పూర్తయ్యాయి. ఎందుకు ఆలస్యమవుతున్నాయి. నిధుల లేమి కారణంగా ఎక్కడైనా అత్యవసర పనులకు ఆటంకం కలిగితే వాటిని సత్వరం పూర్తిచేయడానికి అవసరమయ్యేలా నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి ఈ సమావేశం ద్వారా ప్రతిపాదించొచ్చు. కీలక అంశాలపై డీఆర్సీలో చర్చించవచ్చు. అన్నింటిపైనా సమగ్ర చర్చ చేపట్టవచ్చు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రత్యేక సాయం కావాలంటే తీర్మానం చేసి పంపిస్తారు.
త్వరలోనే నిర్వహిస్తాం
జిల్లా సమీక్ష సమావేశం జరగని మాట వాస్తవమే. గత నవంబరు 28న నిర్వహించాలని అనుకున్నాం. అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశాం. కాని అప్పటి కొన్ని పరిస్థితుల వల్ల సమావేశం వాయిదా పడింది. తర్వాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. పుర పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేశారు. త్వరలో ప్రజాప్రతినిధులతో చర్చించి సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. - జె.నివాస్, జిల్లా కలెక్టర్
ఇదీ చదవండి: