తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాన్నా హోరెత్తిస్తున్నారు. ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉండే వారిని అభ్యర్థులు వెళ్లి నేరుగా కలిసి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టి ‘మీకేం కావాలి చెప్పండి...వీలైనంత వరకూ ప్రయత్నం చేస్తాను. కాని ఓటు మాత్రం నాకే వేయాలి’ అంటూ అభ్యర్థులు తమదైన శైలిలో ఓటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా వర్గాల పెద్దలతో సంప్రదింపులు నెరుపుతున్నారు. కొందరికి సౌకర్యాలు కల్పిస్తామని, ఇంకొందరికి సామాజిక భవనాలు కట్టుకోవడానికి సాయం చేస్తామని, దేవాలయాలు అభివృద్ధి చేసుకోవడానికి విరాళాలు ఇస్తామని, ఇప్పిస్తామని ఇలా ఒక్కో వర్గానికి చెందిన వారిని ఒక్కోరకంగా తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాలే వేదికలు....
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ ఒకప్పుడు పట్టణాల్లో ఉండేవారే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు ప్రతి పల్లెలోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవన్నీ సుపరిచిత యాప్‌లే. అభ్యర్థులు, తమ అనుచరులు, సన్నిహితులు వీటినే ప్రచార వేదికలుగా మార్చుకుంటున్నారు. ప్రత్యేక పాటలు, ఓటు అభ్యర్థిస్తూ ఆడియోలు, వీడియోలు తీసి అందరికీ షేర్ చేయిస్తున్నారు. వారు సర్పంచ్ అయ్యాక ఏమేమి చేస్తారో తెలిపేలా కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి తమ గ్రామస్థులకు పంపిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసేవారు కొందరైతే అసలు సమస్యలపై మాట్లాడుతూ వీడియో తయారుచేసి వాటిని వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ సహా ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన వారు ఒకేచోట ఎక్కువమంది ఉంటే వారందరికీ ప్రత్యేక వాహనాలు సమకూర్చే ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభించారు.
మనోళ్లు ఎక్కడెక్కడున్నారు..!
పనుల నిమిత్తం ఇతర నగరాల్లో పని చేస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. వారంతా స్థానికంగా ఉపాధి లేక వలసలు వెళ్లినవారు. ఇటీవలే సంక్రాంతి పండగకు వీరంతా స్వగ్రామాలకు వచ్చి తిరిగివెళ్లారు. ఇంతలోనే వచ్చిన పంచాయతీ ఎన్నికలకు వారందరినీ స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు, అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో ఆరా తీస్తున్నారు. ఫోన్లు చేసి నిత్యం వారితో మాట్లాడుతున్నారు. వారిని ఏదో ఒకలా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరికి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రానుపోను దారి ఖర్చులకు డబ్బులు పంపిస్తున్నారు. అవసరమైతే ఆరోజు ప్రత్యేకంగా వాహనాలు పెడతామని వచ్చి ఓటేసి వెళ్లాలని మరీమరీ అభ్యర్థిస్తున్నారు.
ఇదీ చదవండి: తొలి దశలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. చిత్తూరులోనే అత్యధికం