నిత్యపూజలతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో నేటి నుంచి రథసప్తమి వేడుకలు మొదలవనున్నాయి. ప్రత్యక్ష భగవానుడికి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆదిత్యుని దివ్య స్వరూపాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరతారు. అభిషేకానంతరం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భాస్కరుని నిజరూప దర్శనం కల్పిస్తారు. అనంతరం స్వామివారికి విశేషార్చన, పుష్పాలంకరణసేవ, ద్వాదశ హారతి, నీరాజనం, సర్వదర్శనం కల్పిస్తారు. స్వామివారికి పవలింపు సేవతో ఉత్సవం ముగియనుంది.
రథసప్తమి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. సుమారు లక్ష మంది భక్తులు తరలివస్తారని అంచనా వేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని... ప్రధాన రహదారి నుంచి ఆలయ ముఖద్వారం వరకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇంద్రపుష్కరిణిలో భక్తుల కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు. రథసప్తమి పర్వదినాన సాధారణ భక్తులకే ప్రాధాన్యమివ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీ పాసుల ఊసేలేదని స్పష్టం చేశారు. 80 వేల లడ్డూలను అధిరారులు సిద్ధం చేశారు. ఉచిత అన్నప్రసాదాల కోసం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
భక్తుల రద్దీ దృష్ట్యా... పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలతో అన్ని ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రత్యక్ష భగవానుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకోవాలని భక్తులను ఆలయ సిబ్బంది కోరారు.
ఇదీ చదవండి: సరస్వతీ దేవిగా.. దుర్గమ్మ దర్శనం