రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించింది. క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘క్విట్ సీపీఎస్’ పేరుతో సంఘం ప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు. వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారని, రెండేళ్లయినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో మరోమారు ఉద్యమించేందుకు 2 లక్షల మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
శ్రీకాకుళంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు నేతలు వినతిపత్రం అందించారు. ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు పాలెల రామాంజనేయులు అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామికి వినతిపత్రం అందించారు. సంఘం ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి, విశాఖలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, తిప్పల నాగిరెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి, సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర, పాయకరావుపేటలో గొల్ల బాబూరావు, బొబ్బిలిలో సంబంగి వెంకట చినఅప్పలనాయుడు తదితరులకు నేతలు వినతిపత్రాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 80 మంది ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చామని ఏపీసీపీఎస్‌ఈఏ నేతలు తెలిపారు. సోమవారం కూడా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఆగస్టు 15న ట్విటర్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ పెద్దలను ట్యాగ్ చేస్తూ తమ డిమాండ్ తెలియజేస్తామని వివరించారు. ఆగస్టు 16 నుంచి 21 వరకూ మధ్యాహ్న సమయంలో నిరసనలు, సెప్టెంబరు 1న అన్ని జిల్లా కేంద్రాల్లో పింఛను విద్రోహ దినం-నయవంచన సభలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి