Speaker Tammineni Comments on Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆమదావలసలో పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు భద్రతగా ఉన్న కమాండోలను చూసి రెచ్చిపోతున్నారని.. వాళ్లని తీసేస్తే ఆయన పని ఫినిష్ అని తమ్మినేని వ్యాఖ్యానించారు. ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత? అని ప్రశ్నించారు. రాష్ట్ర శాసన సభాపతిగా ఈ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతకు ఆయన ఏ విధంగా అర్హులు? అని నిలదీశారు. దేశంలో చాలా మందికి హెచ్చరికలు, ముప్పు పొంచి ఉందని.. వారందరికీ ఈ స్థాయి భద్రత కల్పిస్తారా? అని తమ్మినేని ప్రశ్నించారు. ఇది సరైనది కాదని తమ్మినేని పేర్కొన్నారు.
సమర్థవంతమైన పాలన, నీతివంతమైన పాలన అంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది అని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఆనాడు జగన్ను అనుభవం లేని ముఖ్యమంత్రని.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విమర్శ చేశారని, ఇప్పుడు ఈ పాలన చూసి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. అవినీతి, అన్యాయం, అక్రమాలు, నీతిలేని పాలన, మాయ మాటలు ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి చెందినవేనని, ఇంకా సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడని, ప్రజలను మోసం చేయడానికి మహానాడులో ప్రకటనలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్ని మాయ మాటలు చెప్పిన ప్రజలు వినే పరిస్థితిలో లేరని, ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన పూర్తిగా మర్చిపోవాలని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నంతవరకు ఎవరికీ అవకాశం ఉండదని.. అన్ని రాష్ట్రాలు ఈ పరిపాలన చూసి అదే బాటలో కొనసాగడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకుని అధికారానికి దూరంగా ఉండాలని, సంక్షేమాన్ని చూసి మౌనంగా ఉండిపోవాలి.. తప్ప చేసేదేం లేదని విమర్శించారు.
"బ్లాక్ క్యాట్ కమాండోలను తీసివేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతాడు. వారు ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు.ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ భద్రత?. రాష్ట్ర శాసన సభాపతిగా ఈ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తాను. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతకు ఆయన ఏ విధంగా అర్హులు? దేశంలో చాలా మందికి హెచ్చరికలు, ముప్పు పొంచి ఉంది. వారందరికీ ఈ స్థాయి భద్రత కల్పిస్తారా?"-తమ్మినేని సీతారాం, శాసన సభాపతి