AP JAC Amaravati: ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చే వరకు ఉద్యోగుల ఉద్యమం అగదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏపీ బొప్పరాజు.. ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల.. న్యాయమైన డిమాండ్లు సాధనకై ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో.. మూడవ దశ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టామన్నారు.
ప్రభుత్వం ఉద్యమాన్ని కించపరుస్తుందన్న బొప్పరాజు.. రేపటి నుంచి మూడో దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం ప్రాంతీయ సదస్సు జరుగుతుందన్నారు. రెండు దశల్లో ఉద్యోగులు ఉద్యమాలు చేస్తే.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా వదిలేశారని.. సమయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కష్టపెడుతోందని మండిపడ్డారు. 60 రోజులుగా ఉద్యోగులు ఉద్యమం చేస్తుంటే..ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఉద్యోగికి లక్షల రూపాయలు రావాలని.. వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చర్చల పేరుతో ఉద్యోగులను పిలిచి.. అవమానిస్తున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం ఎందుకొచ్చిందని నిలదీశారు.
"మాకు రావాల్సిన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోయినా సహకరిస్తూ వస్తున్న మమ్మల్ని ప్రభుత్వం విస్మరిస్తే.. గత సంవత్సరం పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘిస్తూ.. ఈ రోజుకి కూడా ఒక్కొక్క ఉద్యోగికి లక్షా ఏబై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల వరకూ ఈ ప్రభుత్వం బకాయి పడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా డీఏ అరియర్స్ ఇవ్వలేదు. పీఆర్సీ అరియర్స్కి దిక్కులేదు.
కనీసం 11వ పీఆర్సీ పేస్కేల్స్ అమలు చేస్తే నెలకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని.. వాటిని కూడా ఇవ్వడం లేదు. దీని వలన వేలాది మంది ఉద్యోగులు నష్టపోతున్నారు. పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేలకు కూడా దిక్కులేదు. గత సంవత్సరం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం పరిష్కరించకపోగా.. మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది దుర్మార్గం.. మీరు హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కానీ.. ఏ ఒక్క అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు". - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్
ఇవీ చదవండి: