శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సమయంలో మడ్డువలస, వంశధార, తోటపల్లి, నారాయణపురం వంటి ఆనకట్టల నుంచి లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నారు. అదే రబీకి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా సాగు అమాతం పడిపోతోంది. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2.38 లక్షల హెక్టార్లు. అదే రబీకి వచ్చేసరికి 1.15 లక్షల హెక్టార్లుకు పడిపోతోంది. వాస్తవానికి రబీలో వాణిజ్య పంటలవైపే రైతులు మొగ్గు చూపుతారు. మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, చెరకు వంటి పంటలు ఇందులో కీలకమైనవి. ఈఏడాది మడ్డువలస నుంచి నీళ్లిస్తామని చెబుతున్నా..ఎంత విస్తీర్ణానికి, ఎంత వరకు ఇస్తారన్నది ఇక్కడ కీలకం. ఇక వంశధార నుంచి అరకొరగానే నీళ్లిస్తారని ఇప్పటికే స్పష్టమైంది. 25వేల ఎకరాలకు మించి నీళ్లివ్వలేక పోవచ్చని చెబుతున్నారు. వంశధార పనులు వేగవంతం చేయాలంటే నీటి నిల్వ సాధ్యం కాదని చెబుతున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లిచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. నాగావళి నదిలో నీళ్లు లేకపోతే నారాయణపురం ఆనకట్ట నుంచి నీళ్లిచ్చే పరిస్థితి ఉండదు.
అన్ని విధాలా ఆదుకోవాలి:
అక్టోబరు నుంచి జనవరి వరకు రబీ సీజనుగా పరిగణిస్తారు. మొక్కజొన్న, అపరాలు, వేరుశనగ, నువ్వులు, చెరకు రబీలో ప్రధానమైన పంటలు. వరి విస్తీర్ణం చాలా తక్కువ. ఖరీఫ్‌లో రైతులు దెబ్బతినటంతో రబీలో ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అవసరమైన విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే రాయితీ ఖరారు చేసి పంపిణీ ఆరంభించినందున ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టమై పోయింది. ఖరీఫ్‌లో వరి సాగు చాలా తక్కువ. దీని వాటా 3.32 శాతం మాత్రమే. కర్షకులు కూడా వాణిజ్య పంటలవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం మాత్రం వరి విత్తనాలపై 33.22 శాతం, పెసర, మినుముపై 30శాతం, వేరుశనగపై 40శాతం, రాగిపై 50శాతం చొప్పున కిలోకు రాయితీ ఇస్తోంది. ఇదైనా జిల్లా అవసరాల మేరకు పూర్తి స్థాయిలో పంపిణీ ఉంటోందా అంటే అదీ లేదు. వ్యవసాయశాఖ ప్రణాళిక మేరకైనా ఇంత వరకు పంపిణీ పూర్తి కాలేదు.
అపరాలూ అధికమే!
శ్రీకాకుళం జిల్లాలో పెసర, మినుము పంటలపై రైతులు అమితాసక్తి చూపుతూ వస్తున్నారు. ఏటా వరి కోతకు ముందే పొలంలో విత్తనాలు జల్లుతూ రావటం ఆనవాయితీ. అంటే ఈపాటికే విత్తన పంపిణీ పూర్తి కావాలి. ఇచ్చేది అరకొరే అయినా.. అది కూడా నూరుశాతం పంపిణీ జరగలేదు. పెసర 15.04 శాతం, మునుములు 17.47శాతం మాత్రమే ఇచ్చారు. వరి విత్తనాలు 16.75శాతం మేర రైతులకు చేరవేశారు. రాగిపై సగం రాయితీ అందిస్తున్నా ఇంత వరకు రైతులకు అందింది 7.75 శాతమే. వేరుశనగ మాత్రం 60 శాతం మేర అందజేయగలిగారు. కొన్ని మండలాల్లో మొక్కజొన్న సాగు పెరుగుతుండటం గమనార్హం.
రబీ సాగు ఆశాజనకం
రబీ సాగు ఆశాజనకంగా ఉంటుంది. మడ్డువలస జలాశయం నీరు అందిస్తారు. వంశధార నుంచి 25వేల ఎకరాల వరకు నీరు అందే వీలుంది. రాయితీ విత్తనాలు విరివిగా ఏపీ సీడ్స్ వద్ద నిల్వ ఉంచాం. రైతులు కోరితే వారి వద్దకే పంపిస్తున్నాం. శత రాయితీ ఇవ్వటం కుదరదు. విత్తన కొరత ఎక్కడా లేదు.
- కె.శ్రీధర్, జేడీ, వ్యవసాయశాఖ, శ్రీకాకుళం
ఇదీ చదవండి: