Achchennaidu on Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం బాగుండాలని, కడిగిన ముత్యంలా ఆయన జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో ఉన్న కొత్తమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. చంద్రబాబు గోత్ర నామాలతో అర్చనలు జరిపించారు.
Achchennaidu Comments: అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ''అర్ధరాత్రి వేళ ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టి, గత 38 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో బంధించారు. ఏం ఆధారాలు సంపాదించారని చంద్రబాబును అరెస్ట్ చేశారు జగన్..?. ఈ రాష్ట్రానికి మంచి చేయడమే చంద్రబాబు చేసిన తప్పా..?, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నడపడం ఆయన చేసిన తప్పా..?. అవినీతి పితామహుడు జగన్ రెడ్డి, అవినీతిలో పుట్టి, పెరిగి, దానిలోనే బతికిన వ్యక్తి ఈ జగన్. న్యాయం ఆలస్యం కావొచ్చు.. కానీ, ఈ దేశంలో ఇంకా న్యాయం బ్రతికే ఉంది. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి, రూ.45వేల కోట్ల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసిన వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ తప్పూ చేయని చంద్రబాబు త్వరలోనే బయటికి వస్తారు. మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు.'' అని ఆయన అన్నారు.
Achennaidu on YSRCP Ministers: చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్యే దాకా.. చంద్రబాబు రూ.3,400 కోట్లు అవినీతి చేశారని తొలుత ఆరోపణలు చేశారని, నాలుగు రోజుల తర్వాత రూ.340 కోట్లే అవినీతి జరిగిందంటూ మరోసారి ప్రచారం చేశారని, మళ్లీ ఐదు రోజుల తర్వాత రూ.27 కోట్లే చంద్రబాబు పార్టీ అకౌంట్లో పడ్డాయని అసత్య ప్రచారాలు చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహించారు.
చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. చంద్రబాబుకు ఈ రోజు న్యాయం జరగాలని కొత్తమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 స్థానాల్లో టీడీపీ గెలవడం ఖాయం. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత వైసీపీ వారు పోటీ చేయడానికి భయపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగలా జరపుకొంటాం. - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
Kala Venkatarao on Tadepalli: తాడేపల్లి ఆదేశాలతోనే చంద్రబాబు నాయుడిపై కుట్రలు జరుగుతున్నాయని.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఆరోపించారు. చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేస్తున్నారు కానీ.. హెల్త్ రిపోర్ట్ మాత్రం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. జగన్ పక్కన కుట్రలు చేసే సలహాదారులు ఉన్నారు కాబట్టి తమకు మరింత ఆందోళన పెరుగుతోందని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వడం లేదో కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యవంతులు కాబట్టి జైలు నుంచి బయటకి వచ్చే లోపల ఏదో ఒక రుగ్మత అంటించాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని కళావెంకట్రావు ధ్వజమెత్తారు.
దళిత మంత్రి నారాయణ స్వామి నారా భువనేశ్వరిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. శవాల మీద పుట్టిన వైసీపీ పార్టీలో ఉండి విమర్శలు చేస్తున్నారు. కోడికత్తి కేసులోని నిందితుడు శ్రీనివాస్ ఒక దళితుడు. అతని కోసం ఈ మంత్రి ఎప్పుడు మాట్లాడలేదు. మాస్క్ అడిగితే దళిత డాక్టర్‌ను పోలీసులు కొడితే కనీసం నోరు మెదపలేదు. అటువంటిది నారా భువనేశ్వరి ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ కుమార్తె.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు భార్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. మరోసారి ఎన్టీఆర్, నారా కుటుంబ సభ్యులపై తప్పుగా మాట్లాడితే ఊరుకోం. నారాయణ స్వామి చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలుపుతాం. - వంగలపూడి అనిత, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు