గుజరాత్లోని వీరవల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడు అనారోగ్యం బారిన పడి బుధవారం మృతి చెందాడు. గార మండలం కె.మత్స్యలేశం గ్రామం కళింగపట్నం శివారులోని చిన్నపల్లిపేటకు చెందిన ఎన్నేటి జగన్నాథం చేపలవేట, కూలీ పనుల కోసం ఎనిమిది నెలల క్రితం వీరవల్ వెళ్లాడు. ప్రస్తుత లాక్డౌన్ కారణంగా సొంత గ్రామానికి చేరలేని దుర్భర పరిస్థితిల్లో జగన్నాథంతో పాటు మరికొందరు అక్కడే ఉన్నారు. వారికి వసతి సౌకర్యాలు కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్.. మూడ్రోజుల కిందట శ్రీకాకుళం నుంచి ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించారు. వీరు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్న సమయంలోనే జగన్నాథం కడుపునొప్పితో అనారోగ్యం పాలయ్యాడు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి జగన్నాథం మృతి చెందాడు.
అక్కడే అంత్యక్రియలు..
మృతదేహానికి పరీక్ష నిర్వహించిన అనంతరం అక్కడే దహన సంస్కారాలు చేసినట్లు శ్రీకాకుళం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం సభ్యులు తెలిపారు. లాక్డౌన్ కారణంగా చివరి చూపునకూ నోచుకోలేకపోయామని మృతుని భార్య, బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వారందరినీ బోట్ల నుంచి వేరే క్వారంటైన్ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన వసతి కోసం వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: