Villagers collecting donations and building the road : శ్రీ సత్య సాయి జిల్లాలోని ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇంకేముంది గ్రామం అభివృద్ధి దిశలో నడుస్తుంది అనుకుంటే పొరపాటే అయితే విశేషమేంటంటే రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. రోడ్డు నిర్మాణం చేపడుతున్నది గుత్తేదారులు కాదు.. గ్రామస్థులు. విరాళాలు సేకరించి మరీ స్వయంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు.
గ్రామస్థుల నరకయాతన : శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి మండలం సి. వెంకటాపురం గ్రామానికి వెళ్లాలంటే లేపాక్షి హిందూపురం ప్రధాన రహదారిపై బిసలమానేంపల్లి నుండి వెంకటాపురానికి ఒకటిన్నర, కిలోమీటర్ దూరం ఉంది. ఈ రోడ్డు అధ్వాన స్థితికి చేరి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని రాకపోకలకు తాము నరకయాతన అనుభవిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్థులు పలు దఫాలుగా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అధికారులు పాలకుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
విరాళాల సేకరణ : దీంతో విసిగి వేసారినా గ్రామస్థులు ప్రభుత్వం నుంచి స్పందన రాదు అని గ్రహించి చేసేది లేక గ్రామంలో ఒక్కో ఇంటి నుంచి వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు చందాల రూపంలో నగదును సేకరించి తమ గ్రామానికి వారే స్వయానా రోడ్డు పనులు ప్రారంభించారు. చందాల రూపంలో సేకరించిన నగదుతో ప్రస్తుతం బిశలమానేంపల్లి నుండి వెంకటాపురం గ్రామం వరకు మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించి రోడ్డును చదును చేసుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మరికొంత విరాళాల ద్వారా సేకరించి శాశ్వత రోడ్డు నిర్మించుకుంటామని గ్రామస్థులు చెబుతున్నారు.
"మా గ్రామంలో రహదారి నిర్మాణానికి పూనుకున్నాం. దీనికోసం ప్రతి ఇంటి నుంచి చందాలు సేకరించాం. గ్రామం నుంచి బిసలమానేంపల్లికి వెళ్లే రహదారి అధ్వాన స్థితికి చేరుకుంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో సొంత ఖర్చుతోనే స్వయంగా రోడ్డు నిర్మాణ పనులు మెుదలు పెట్టాం. మా ఊర్లో 175 ఇళ్లు ఉన్నాయి. ఇంటింటికి వెయ్యి రూపాయల నుంచి రూ. 3000 రూపాయల వరకు చందాలు వేసుకుని రోడ్డు వేసుకుంటున్నాము. చందాల రూపంలో సేకరించిన నగదుతో.. రహదారిపై మట్టిని తరలించి చదును చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి"- గ్రామస్థులు