Quorum members fire on Hindupuram Municipal Commission: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి. కౌన్సిల్ సమావేశానికి హాజరైన పట్టణ ప్రథమ పౌరురాలు, బీసీ చైర్‌పర్సన్ ఇంద్రజకు ఘోర అవమానం జరిగింది. కౌన్సిల్ సమావేశానికి 13 మంది కోరం సభ్యులు విచ్చేసినప్పటికీ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్.. కోరం సభ్యులు లేరంటూ కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోయారు. వెళ్లూ వెళ్తూ.. కోరం సభ్యుల హాజరు పుస్తకంతోపాటు (మినిట్ బుక్) అధికారులను తన వెంట తీసుకెళ్లారు. దీంతో చైర్‌పర్సన్ కమిషనర్‌కు పలుమార్లు ఫోన్ చేసి ప్రాధేయపడినా.. సమావేశానికి హాజరుకాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గందరగోళంగా కౌన్సిల్ సమావేశం.. హిందూపురం పురపాలక సంఘంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వైఎస్సార్సీపీ వర్గపోరుతో అభాసుపాలైంది. అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు మున్సిపల్ కౌన్సిల్ సాక్షిగా బయటపడ్డాయి. హిందూపురం నూతన సమన్వయకర్తగా ఎన్నికైన దీపికా వేణు రెడ్డి వర్గానికి చెందిన 24 మంది కౌన్సిలర్లు.. చైర్‌పర్సన్ ఇంద్రజకు వ్యతిరేకంగా వ్యవహరించాలంటూ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో 10 గంటల 50 నిమిషాలకు మున్సిపల్ కమిషనర్, అధికారులు సమావేశానికి హాజరుకాగా.. కోరం సభ్యులు కాస్త ఆలస్యంగా విచ్చేశారు. దీంతో సమావేశానికి సరిపడా కోరం సభ్యులు లేరంటూ మున్సిపల్ కమిషనర్, అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. మినిట్ బుక్‌ను తీసుకెళ్లొద్దంటూ చైర్‌పర్సన్ కమిషనర్‌ను ఎంత వేడుకున్నా.. ఆమె మాటను లెక్కచేయకుండా తీసుకెళ్లిపోయారు.
చైర్‌పర్సన్ ఇంద్రజ ఘోర అవమానం.. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశానికి చైర్‌పర్సన్ వర్గానికి చెందిన ఏడుగురు కౌన్సిలర్లతోపాటు.. టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. దీంతో 'సమావేశానికి 13 మంది కోరం సభ్యులు విచ్చేశారు.. దయచేసి సమావేశానికి హాజరు అవ్వండి' అంటూ చైర్‌పర్సన్ ఇంద్రజ.. మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు ఫోన్ చేసి వేడుకున్నా పట్టించుకోలేదు. కౌన్సిల్ సమావేశానికి కమిషనర్, అధికారులు హాజరుకాకపోవడంపై అధికార పార్టీ కౌన్సిలర్లు కమిషనర్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు చైర్‌పర్సన్ ముందు బైఠాయించి.. కౌన్సిల్ సమావేశాన్ని కొనసాగించాలంటూ ఆందోళన చేపట్టారు.
కమిషనర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.. కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ.. ''ఒక ప్రభుత్వ అధికారి రాజకీయం చేయడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు మేమంతా ఫిర్యాదు చేస్తాం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉన్న మున్సిపల్ కమిషనర్, అధికారులు.. వైసీపీకి చెందిన రెండు వర్గాల పోరుతో సమావేశాన్ని అపహాస్యం చేశారు. అధికార పార్టీకి చెందిన కోరం లేకపోయినా.. హిందూపురం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో మేమంతా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యాం. ప్రజా సమస్యలపై చర్చించాలని కౌన్సిల్ హాల్‌కు వస్తే కమిషనర్ వెళ్లిపోవడం ఏంటి..?'' అని చైర్‌పర్సన్ ఇంద్రజ, 13 మంది కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.