Sub Registrar Srinivasa Nayak Family Agitation: లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడి ఆత్మహత్య చేసుకున్న సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ మృతదేహంతో.. ఆందోళనకు సిద్ధమైన కుటుుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ రెండు రోజుల క్రితం చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పెనుకొండ మండలం గోని పెంటతాండకు తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు.. ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి నిర్ణయించారు.
మృతదేహంతో పెనుకొండకు బయలుదేరిన కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలంటూ కుటుంబసభ్యులు పోలీసులను దాటుకుని వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, శ్రీనివాసనాయక్ బంధువుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ పరామర్శకు రాకపోవడంపై బంధువులు, ఎస్టీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతీయుతంగా ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని పోలీసులను మృతుడి బంధువులు కోరారు. పోలీసులు ఒప్పుకోకపోవడంతో వారిని దాటుకుని శ్రీనివాస్ బంధువులు ముందుకు వెళ్లారు.
ఏసీబీ అధికారుల నుంచి సబ్ రిజిస్ట్రార్ పరారీ, రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి
మృతిపై లంబాడ హక్కుల పోరాట సమితి అనుమానాలు : బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ మృతిపై లంబాడ హక్కుల పోరాట సమితి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారుల కస్టడీ నుంచి పరారైన తర్వాత.. ఆత్మహత్య చేసుకున్నాడనే ఘటనలో ప్రతిదానిలో అనుమానాలే ఉన్నాయని వారు ఆరోపించారు. శ్రీనివాస్ నాయక్ మృతిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Lambada Hakkula Porata Samithi Protest in Puttaparthi: శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ పుట్టపర్తిలో లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గిరిజనుల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలని.. న్యాయం కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో నిజాలు తేల్చే వరకు పోరాడుతామని ప్రకటించారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ అక్రమ దందా జరుగుతోందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికారులుగా ఎదగడంపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్రారెడ్డి అనే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న విషయం తెలిసిందే. సబ్ రిజిస్ట్రార్ సూచన మేరకే తాను లంచం తీసుకున్నట్లు డాక్యుమెంట్ రైటర్ తెలపగా.. ఏసీబీ అధికారులు సబ్‌రిజిస్ట్రార్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారుల నుంచి సబ్ రిజిస్ట్రార్ తప్పించుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన తప్పించుకున్నాడనే అంశంపై.. అప్పుడు అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి
వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!