LOKESH PADAYATRA : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 49వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. కదిరిలో నాలుగో రోజు హిందూపురం రోడ్డులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బస కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన చిరంజీవిరావు, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డిలను లోకేశ్ అభినందించి.. అనంతరం వారిని సత్కరించారు.
అలాగే సోమవారం(మార్చి 20) అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ నాయకుల దాడిని నిరసిస్తూ లోకేశ్, ఇతర నాయకులు నల్ల బ్యాడ్జీలను ధరించి పాదయాత్రను మొదలుపెట్టారు. హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల నుంచి భారీగా తెలుగుదేశం శ్రేణులు తరలివచ్చారు. సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం అనంతరం పాదయాత్రను ప్రారంభించిన ఆయన.. అర్ధాంతరంగా నిర్మాణాలు ఆగిపోయి వృథాగా ఉన్న టిడ్కో గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు.
అధునాతన సౌకర్యాలతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేదలకు సౌకర్యాలతో నిర్మించిన గృహాలను వృథాగా వదిలేయడాన్ని లోకేశ్ తప్పు పట్టారు. చంద్రబాబు హయాంలో 90 శాతం పూర్తైన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా పూర్తి చేయలేదని లోకేశ్ విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపిక లోనూ అన్యాయం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఉన్న లబ్ధిదారులను తొలగించి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఇళ్లు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
చిన్నపాటి పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందని లోకేశ్ విమర్శించారు. తక్షణమే మిగిలిన ఇళ్ల పనులు పూర్తి చేసి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సూచించారు. అనంతరం పాదయాత్రను మొదలుపెట్టిన లోకేశ్ కదిరి మండలం అలిపూర్ తండా వద్ద స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
లోకేశ్ యువగళం పాదయాత్రలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అక్కడ నుంచి ముత్యాల చెరువు గ్రామానికి చేరుకున్న లోకేశ్ స్థానికులతో మాట్లాడారు. ముత్యాల చెరువు వద్ద భోజన విరామ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. భోజనం అనంతరం మరో మూడు కిలోమీటర్లు నడిచిన అనంతరం పుట్టపర్తి నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనుంది.
ఘన స్వాగతాలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. పాదయాత్రలో చిన్నపిల్లల నుంచి యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహిళలు హారతులు పడుతున్నారు.
ఇవీ చదవండి: