Lokesh Promised to Two Childrens Educate : మగ్గంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న జీవితం వారిది. ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అలాంటి వారి జీవితంలో అప్పులు కుప్పలుగా మారి.. బతుకు భారమైన సమయంలో ఆ ఇంటి పెద్దను మృత్యువు గుండెపోటు రూపంలో కబళించింది. దీంతో కుటుంబభారాన్ని నెత్తినేసుకున్న మృతుడి భార్యకు.. అటు అప్పులు తీర్చటానికి, ఇల్లు అద్దె చెల్లించానికి కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల పోషణ మరింత భారంగా మారిందని.. ఆమె లోకేశ్‌ను కలిసి తన వ్యథను తెలిపింది.
స్పందించిన లోకేశ్ : ధర్మవరానికి చెందిన రాములమ్మ అనే మహిళ తన ఇద్దరు పిల్లల పోషణ కష్టంగా మారిందని లోకేశ్‌కు మొర పెట్టుకుంది. వారు మగ్గం మీద ఆధారపడి జీవించే వారని పేర్కొంది. ఈ సమయంలో అప్పుల పాలయ్యామని.. అప్పులు తీర్చలేక భారంగా మారటంతో తన భర్త గుండె పోటుతో మృతి చెందినట్లు తెలిపింది. తనకు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదని, అద్దె చెల్లించటానికి ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని.. పిల్లల పోషణ కష్టంగా మారిందని ఆమె లోకేశ్‌కు తన గోడు వినిపించిది. దీనికి స్పందించిన లోకేశ్.. పిల్లలిద్దర్ని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆమె వివరాలను సేకరించి.. పిల్లలను పాఠశాలలో చేర్పించే బాధ్యతను స్థానిక సీనియర్ నేత గడ్డం సుబ్రహ్మణ్యంకు అప్పగించారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత వచ్చే విద్యాసంవత్సరం నుంచి పిల్లలను పాఠశాలలో చేర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఆమె కుటుంబ పరిస్థితి పూర్తిగా తెలుసుకున్న సుబ్రహ్మణ్యం.. పార్టీ ఆదేశాల మేరకు నిత్యావసరాల కోసం 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. పిల్లలను చదివిస్తానని లోకేశ్ హామీ ఇవ్వటంతో రాములమ్మ కృతజ్ఞతలు తెలిపింది.
"పెట్టుబడులు పెట్టటంతో అప్పులయ్యాయి. అప్పు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వమని ఒత్తిడి తీసుకురావటంతో నా భర్త గుండెపోటుతో మరణించాడు. ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాము. నా పిల్లల్ని చదివించుకునే స్థోమత నాకు లేదు. లోకేశ్ వస్తున్నారని తెలిసి నా బాధ వినిపించటానికి వచ్చాను. ఎండకాలం సెలవుల తర్వాత నా పిల్లల్ని స్కూల్ పంపిస్తానని చెప్పారు." -రాములమ్మ, బాధిత మహిళ
"వేసవి సెలవులు ముగిసి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే.. పిల్లలిద్దర్ని పాఠశాలలో చేర్పిస్తాము. అందుకు వారి దగ్గర అన్ని వివరాలు సేకరించాము. ఆమెకు మా పార్టీ అన్ని విదాలా సహాయం చేస్తుంది. ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా ఏదైనా సహాయం చేయాలని.. నిత్యావసరాల కోసం కొద్ది మొత్తంలో 20వేల రూపాయల అర్థిక సహాయం చేశాము." - గడ్డం సుబ్రహ్మణ్యం, టీడీపీ నేత
నేత కార్మికులతో ఆత్మీయ సమావేశం : తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. 58వ రోజు ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ధర్మవరంలో నేత కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చేనేత మగ్గాల మీద ఆధారపడటంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నేత కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవడం లేదని తమ కష్టాలను వివరించారు. వ్యవసాయ రంగంలో ఆత్మహత్యల తరహాలోనే చేనేత కార్మికులు పూట గడవక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేతన్నలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబంలోని మహిళలు పిల్లలను పోషించుకోలేకపోతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. కరోనాతో వ్యాపారం లేక నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవటం లేదని వారు వివరించారు.
ఇవీ చదవండి :